ఐఫోన్ ఎక్స్: రేటు లక్ష దాటేసింది

ఐఫోన్ 8 సిరీస్ ను ప్రవేశపెట్టిన కొన్ని గంటలకే తన ప్రతిష్టాత్మక ఐఫోన్ ఎక్స్-సిరీస్ ను కూడా ప్రకటించింది ఆపిల్ సంస్థ. ఆపిల్ సంస్థకు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన (ఫ్లాగ్ షిప్) మొబైల్ కాగా.. ఎక్స్-సిరీస్ తో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది ఆపిల్. 

అన్నింటికంటే ముఖ్యంగా ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న హోమ్ బటన్ ను ఎక్స్ సిరీస్ లో తొలిగించింది. చాలా ఆండ్రాయిండ్ ఫోన్ల నుంచి ఐఫోన్ ను భిన్నంగా చూపించేది ఈ హోమ్ బటన్ మాత్రమే. ఆ బటన్ ను సంస్థ తొలిగించింది. అంటే.. ఐఫోన్ ఎక్స్ అనేది టోటల్ టచ్ స్క్రీన్ తో వస్తోందన్నమాట. 

ప్రధానమైన ఈ మార్పుతో పాటు 12 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, అత్యాధునిక ఫ్లాష్, ఎనిమోజీ, ఆగ్యుమెంట్ వర్చువల్ రియాలిటీ, వైర్ లెస్ ఛార్జింగ్, ఫేస్ ఐడీ, బిగ్ డిస్ ప్లే, ఓఎల్ఈడీ లాంటి ఎన్నో ఫీచర్లు ఎక్స్-సిరీస్ తో అందుబాటులోకి వచ్చాయి. 

ఇక ప్రధానమైన విమర్శల విషయానికొస్తే ముఖ్యంగా 3 అంశాలపై ఆపిల్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిలో మొదటిది ధర. ఐ ఫోన్స్ లో కాస్త్ లీ ఫోన్ ఇదే. ఇండియాలో దీని ధర అటుఇటుగా లక్షా 2వేల రూపాయలు ఉండబోతోంది. దీంతో పాటు ఫేస్ ఐడీ ఆశించిన స్థాయిలో లేకపోవడం, హోమ్ బటన్ ను తొలిగించడాన్ని తప్పుబడుతున్నారు వినియోగదారులు. వచ్చేనెల 3 నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.