Advertisement

Advertisement


Home > Sports - Cricket

బంగ్లాని 'ఉతికి ఆరేసిన' కోహ్లీ సేన

బంగ్లాని 'ఉతికి ఆరేసిన' కోహ్లీ సేన

ఛాంపియన్స్‌ ట్రోఫీలో మరో ఘనవిజయం టీమిండియా సొంతమయ్యింది. భారత్‌, బంగ్లా జట్ల మధ్య జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో టీమిండియా, ఫైనల్‌లోకి దూసుకెళ్ళింది. ఫైనల్‌లో టీమిండియా - పాకిస్తాన్‌ జట్టుతో తలపడనుంది. 

టాస్‌ ఎంచుకున్న టీమిండియా, బంగ్లా జట్టుని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఒక్క పరుగుకే తొలి వికెట్‌ని కోల్పోయిన బంగ్లా, 31 పరుగుల వద్ద రెండో వికెట్‌ని కోల్పోయింది. ఆ తర్వాత మూడో వికెట్‌ కోల్పోకుండా కాస్సేపు బంగ్లా ఆటగాళ్ళు, భారత బౌలర్లను ప్రతిఘటించారు. అయితే, కట్టుదిట్టమైన బౌలింగ్‌ నడుమ టీమిండియా, బంగ్లా జట్టుని 50 ఓవర్లలో 264 పరుగులకే కట్టడి చేయగలిగింది. ఈ క్రమంలో బంగ్లా జట్టు ఏడు వికెట్లు కోల్పోయింది. 

265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, ఏ దశలోనూ బంగ్లా బౌలర్లకు అవకాశమివ్వలేదు. 87 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా, మరో వికెట్‌ చేజారకుండానే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీ (123)ని పూర్తి చేయగా, కెప్టెన్‌ కోహ్లీ 96 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఛేజింగ్‌లో ఎప్పుడూ రెచ్చిపోయే కోహ్లీ, ఈసారి కూడా అదే దూకుడు ప్రదర్శించడం గమనార్హం. 

బంగ్లా - టీమిండియా సెమీస్‌ పోరుకి ముందు, బంగ్లా క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో ప్రదర్శించిన అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. సెమీస్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలోనూ మైదానంలో బంగా క్రికెట్‌ అభిమానులు చాలా 'అతి' చేశారు. ఓ దశలో ఆ 'అతి'కి చెక్‌ పెట్టేందుకు టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ కూడా, కాస్తంత ఉద్రేకానికి గురయ్యాడు.. మైదానంలో చిత్ర విచిత్రమైన వ్యవహారశైలితోనూ సందడి చేశాడు.

ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆశించినట్లు అద్భుతాలేమీ జరగలేదు. 40.1 ఓవర్లలోనే కోహ్లీ సేన 265 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లా బౌలర్లకు ధావన్‌ (46) వికెట్‌ తప్ప, మరో వికెట్‌ దక్కకపోవడం చూస్తేనే, ఏ స్థాయిలో బంగ్లా జట్టుని టీమిండియా ఉతికి ఆరేసిందో అర్థం చేసుకోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?