Advertisement

Advertisement


Home > Sports - Cricket

క్రికెట్‌ హిట్‌ వికెట్‌

క్రికెట్‌ హిట్‌ వికెట్‌

క్రికెట్‌ అంటే జెంటిల్‌మెన్‌ గేమ్‌.. ఇది ఒకప్పటి మాట.!

క్రికెట్‌ అంటే చీటింగ్‌.. ఇది ఇప్పటి మాట.!

క్రికెట్‌ అంటే ఎత్తుకు పైయెత్తులు మాత్రమే కాదు.. క్రికెట్‌ అంటే తిట్టుకోవడం కూడా.. ఆ తిట్టుకోవడానికి స్లెడ్జింగ్‌.. అనే గొప్ప పేరు పెట్టేశారండోయ్‌. ఇదంతా క్రికెట్‌కి ఆస్ట్రేలియా ఇచ్చిన వెరైటీ 'గౌరవం'. క్రికెట్‌లో ఆస్ట్రేలియా చిన్న జట్టేమీ కాదు.. అగ్రస్థాయి జట్టు. కానీ, గెలుపుకోసం అడ్డదార్లు తొక్కుతుంది. అందుకే, ఆస్ట్రేలియా క్రికెట్‌ ఘనతల వెనుక ఇప్పుడు కొత్తగా అనుమానాలు విన్పిస్తున్నాయి. ఇటీవలి కాలంలో.. ఆ మాటకొస్తే, గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ మునుపెన్నడూ లేనంతస్థాయిలో తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటోంది.

జెంటిల్‌మెన్‌ గేమ్‌ అంటే..

నిజానికి క్రికెట్‌ అంటే జెంటిల్‌మెన్‌ గేమ్‌. ఇతర క్రీడల్లో సంగతెలా వున్నా, క్రికెట్‌లో క్రీడా స్ఫూర్తి చాలా ఎక్కువ. ఇది ఒకప్పటి మాట. మైదానంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ షూ లేస్‌ ఊడిపోతే, కట్టేందుకూ వెనుకాడరు. పొరపాటున, తాను విసిరిన బంతి, బ్యాట్స్‌మెన్‌కి తగిలితే వెళ్ళి క్షమాపణ చెప్పడం ఎన్నో సందర్భాల్లో చూశాం. బంతి బౌండరీ లైన్‌కి టచ్‌ చేసే సమయంలో, దాన్ని ఆపినప్పుడు, ఒకవేళ తానుగానీ బంతిగానీ ఆ లైన్‌ని టచ్‌ చేసిందేమోనన్న అనుమానం కలిగితే, ప్రత్యర్థికి అనుకూలంగా 'ప్రకటన' చేసే ఆటగాళ్ళు ఒకప్పుడు వుండేవారు. కొన్ని రూల్స్‌ ప్రకారం ప్రత్యర్థి ఔట్‌ అయినప్పుడు, అప్పీల్‌ చేసే అవకాశం వున్నా 'క్రీడా స్ఫూర్తి' ప్రదర్శించి, అప్పీల్‌ చేయకుండా వున్న సందర్భాలెన్నో చూశాం. ఇదీ క్రికెట్‌ అంటే. ఇదీ క్రీడా స్ఫూర్తి అంటే. కానీ, ఇప్పుడు ఆ క్రీడా స్ఫూర్తి కొరవడింది. జెంటిల్‌మెన్‌ గేమ్‌కి ఇప్పుడు మసి అంటుకుంటోంది.

మసిపూసిన కంగారూలు..

గెలుపు కోసం అడ్డదార్లు తొక్కేయొచ్చు.. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీయడం అనేది ఓ వ్యూహం.. అంటూ, మైదానంలో బండ బూతులు తిట్టే సంస్కృతిని ప్రవేశపెట్టింది ఆస్ట్రేలియా జట్టే. నికృష్టమైన ఈ ప్రక్రియకి 'స్లెడ్జింగ్‌' అనే స్టైలిష్‌ పేరు కూడా పెట్టేశారు. అక్కడితో ఆగక, మైదానంలో క్రీడా స్ఫూర్తిని సర్వనాశనం చేసేంది ఆస్ట్రేలియా జట్టు. క్యాచ్‌ పట్టే ముందు బంతి నేలను తాకిందేమోనని అంపైర్‌ అనుకునేంతలోపు, 'అది ఔటే..' అంటూ బుకాయించేసి, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని పెవిలియన్‌కి పంపించే స్పందాయం మొదలుపెట్టింది కూడా కంగారూలే. ఇవన్నీ చాలవన్నట్లు.. ఇప్పుడు కొత్తగా డీఆర్‌ఎస్‌కి కూడా మసిపూసేశారు ఆసీస్‌ ఆటగాళ్ళు. మైదానంలో ఆటగాళ్ళు అప్పీల్‌ చేసుకోడానికి వీలు కల్పించేదే రివ్యూ సిస్టమ్‌. దాన్ని డ్రెస్సింగ్‌ రూమ్‌ ద్వారా కన్‌ఫామ్‌ చేసుకోవడమనే చెత్త వ్యూహానికి తెరలేపి, అంతర్జాతీయ క్రికెట్‌లో అభాసుపాలైపోయింది. 'చేసింది తప్పే..' అని ఒప్పుకోవడంతోనే, ఆసీస్‌ 'హిట్‌ వికెట్‌' అన్పించుకుంది. మామూలుగా ఓ జట్టు స్లోగా బౌలింగ్‌ చేస్తేనే, జరీమానా విధించే అవకాశమున్నప్పుడు, క్రికెట్‌ని భ్రష్టుపట్టిస్తోన్న ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌ని ఏం చేయాలి.? తొక్కి పెట్టి నార తీసెయ్యాల్సిందే. కాదంటారా.?

- సింధు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?