Advertisement

Advertisement


Home > Sports - Cricket

డ్యామిట్‌.. టీమిండియా 'అడ్డం' తిరిగింది

డ్యామిట్‌.. టీమిండియా 'అడ్డం' తిరిగింది

లీగ్‌ దశలో పాకిస్తాన్‌ జట్టు మీద బీభత్సమైన ఫామ్‌ ప్రదర్శించిన టీమిండియా, అదే విజయాన్ని ఫైనల్‌లోనూ కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, బ్యాటింగ్‌ అనుకూలించే పిచ్‌ మీద టాస్‌ గెలిచిన టీమిండియా, ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతోనే 'పతనం' ప్రారంభమయ్యిందని అభిమానులు ఆందోళన చెందారు.

అలవోకగా పాకిస్తాన్‌, 300 పరుగులు దాటేసి, 338 పరుగులు చేసింది నిర్ణీత 50 ఓవర్లలో. అయితేనేం, అద్భుతమైన బ్యాటింగ్‌ లైనప్‌ వున్న టీమిండియా.. అదరగొట్టేస్తుందిలే.. అని చాలామంది నమ్మారు. ఇంకొందరు, కొంత అనుమానం వ్యక్తం చేశారు. 

అనుమానాలే నిజమయ్యాయి.. నమ్మకం వమ్మయ్యింది.. సూపర్బ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ వున్న టీమిండియా, పేకమేడలా కుప్ప కూలిపోయింది పాకిస్తాన్‌ బౌలింగ్‌ ముంది. 0 పరుగుల వద్ద తొలి వికెట్‌, 6 పరుగుల వద్ద రెండో వికెట్‌, 33 పరుగుల వద్ద మూడో వికెట్‌, 54 పరుగుల వద్ద నాలుగు, ఐదు వికెట్లు.. 72 పరుగుల వద్ద ఆరో వికెట్‌.. ఆ తర్వాత కాస్సేపు ప్రతిఘటన.. 152 పరుగులకి ఏడో వికెట్‌.. 158 పరుగులకి ఆలౌట్‌. ఇదీ టీమిండియా 'కథ'. 

'టీమిండియాని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలుత బ్యాటింగ్‌ చేయించొద్దు..' అని పాక్‌ మాజీ క్రికెటర్లు, పాకిస్తాన్‌ జట్టుని హెచ్చరించారు. దాన్ని కూడా కెప్టెన్‌ కోహ్లీ పరిగణనలోకి తీసుకోలేకపోవడం ఆశ్చర్యకరమే.

ఒక్కోసారి, వ్యూహాలు దెబ్బకొట్టేస్తుంటాయి. ఇప్పుడూ అదే జరిగి వుండొచ్చు. ఆట అన్నాక గెలుపోటములు సహజం. అయితే, ఇంత దారుణమైన పరాజయం.. భారత క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోవడం కష్టమే. 

'ఛాంపియన్స్‌'గా మరోసారి సత్తా చాటే అవకాశమొస్తే, టీమిండియా ఆ అవకాశాన్ని చేజార్చుకుంది. ప్చ్‌.. ఫాదర్స్‌ డే సందర్భంగా ఇండియా, పాకిస్తాన్‌కి ఛాంపియన్స్‌ ట్రోఫీని పువ్వుల్లో పెట్టి బహుమతిగా ఇచ్చేసినట్టుంది. అభిమానులకి తీవ్ర నిరాశను మిగిల్చింది.

జీర్ణించుకోవడం కష్టమే.. 'పాకిస్తాన్‌ జట్టు ఫిక్సింగ్‌తోనే ఫైనల్‌లోకి వచ్చింది..' అని పాక్‌ మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ, ఈ ఫైనల్‌ కూడా ఫిక్సింగే.. అని కొందరు భారత క్రికెట్‌ అభిమానులు భావించొచ్చుగాక.! అది టీమిండియా ఓటమి కారణంగా వారిలో పుట్టిన ఆవేదనగానే పరిగణనలోకి తీసుకుందామా.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?