Advertisement

Advertisement


Home > Sports - Cricket

ధోనీ గెలిచాడు.. టీమిండియా ఓడింది

ధోనీ గెలిచాడు.. టీమిండియా ఓడింది

టీమిండియా ఓడింది.. అలాంటిలాంటి ఓటమి కాదు.. దారుణమైన ఓటమి. ఆట అన్నాక గెలుపోటములు సహజం. కానీ, అత్యద్భుతమైన ఫామ్‌లో వున్న జట్టు, అస్సలేమాత్రం ఫామ్‌లో లేని జట్టు చేతిలో ఘోరంగా పరాజయం పాలవడమంటే ఇంకేమన్నా వుందా.? అదీ, టాప్‌ 5 బ్యాట్స్‌మెన్‌ అత్యంత పేలవమైన ప్రదర్శన చేస్తే.. ఆదివారం, మ్యాచ్‌ని తిలకించేందుకోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసిన అభిమానులు ఏమైపోవాలి.? 

2, 0, 9, 0, 2.. ఇవీ ఒకటీ, రెండూ, మూడు, నాలుగు, ఐదు.. ఇలా ఐదుగురు బ్యాట్స్‌మన్‌ సాధించిన వ్యక్తిగత స్కోర్‌. టాప్‌ ఆర్డర్‌ ఇంత గొప్పగా ఫెయిలయితే, శ్రీలంక విజయం సాధించకుండా వుంటుందా.? ఇంతకీ ధోనీ సంగతేంటి.! ఒక్క ధోనీ, మ్యాచ్‌ని గెలిపించేయగలడని చాలా సందర్భాల్లో నిరూపితమయ్యింది. కానీ, ఈసారి ధోనీకి ఆ ఛాన్స్‌ దక్కలేదు. 

అయినాగానీ, ధోనీ గెలిచాడు. అవును, టీమిండియా ఓడిపోయినా ధోనీ గెలిచాడన్నది నిర్వివాదాంశం. 'ధోనీ పనైపోయింది..' అన్న వారి విమర్శలకు ధోనీ, తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. 87 బంతులు ఎదుర్కొని ధోనీ 65 పరుగులు చేశాడు. అవతలి ఎండ్‌లో ఎవరన్నా ధోనీకి సపోర్ట్‌గా నిలబడి వుంటే, ధోనీ సెంచరీ చేసేవాడే. పరిస్థితి ఎక్కడా ధోనీకి అనుకూలంగా కన్పించలేదు. 

పరుగుల సంగతి తర్వాత.. ఎదుర్కొన్న బంతుల పరంగా ధోనీ తర్వాతి స్థానంలో నిలిచింది మాత్రం శ్రేయాస్‌ అయ్యర్‌ మాత్రమే. అతను 27 బంతులు ఎదుర్కొన్నాడు. టాప్‌ ఆర్డర్‌లో ఇంకెవరూ 20 బంతుల ఆడటానికీ ఇష్టపడలేదు. టెయిల్‌ ఎండర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ ఒక్కడే 25 బంతులు ఆడటం గమనార్హం.  38.2 ఓవర్లలో టీమిండియా 112 పరుగులకు ఆలౌట్ అయితే, 113 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 20.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

విరాట్‌ కోహ్లీ రెస్ట్‌ కారణంగా, జట్టుకి అందుబాటులో లేకపోవడంతో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా, శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఆడుతోన్న విషయం విదితమే. ఈ పరాజయం టీమిండియాకి గుణపాఠమైతే, లంకకి మాత్రం కొండంత ఆత్మవిశ్వాసాన్నిచ్చిందనం నిస్సందేహం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?