Advertisement

Advertisement


Home > Sports - Cricket

కోహ్లీ.. ఇలా చేయడం కరెక్టేనా.?

కోహ్లీ.. ఇలా చేయడం కరెక్టేనా.?

బంగ్లాదేశ్‌ అంటే క్రికెట్‌లో 'పసికూన' అనే అంతా భావిస్తారు. అయితే, పసికూన అయినా పెద్ద జట్లకు షాకిచ్చిన ఘనత బంగ్లాదేశ్‌ సొంతం. అయినాసరే, ఎప్పుడూ బంగ్లాదేశ్‌ జట్టు టైటిల్‌ ఫేవరెట్‌గా కన్పించదు. అలాగని, ఏ జట్టూ బంగ్లాదేశ్‌ని లైట్‌ తీసుకోదు కూడా.

టీమిండియాకి సైతం ఓ సారి వరల్డ్‌కప్‌ పోటీల్లోనే బంగ్లాదేశ్‌ షాకిచ్చింది. దాంతో, బంగ్లా - టీమిండియా పోరు.. అదీ కీలకమైన నాకౌట్‌ సందర్భాల్లో ఒకింత హాట్‌ హాట్‌గానే జరుగుతుంటుంది. 

ఇక, అసలు విషయానికొస్తే బంగ్లా - టీమిండియా మధ్య చాంపియన్స్‌ ట్రోఫీ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. బంగ్లా ఆటగాడు ముష్ఫికర్‌ రహీమ్‌ కొట్టిన బంతిని టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ ఒడిసిపట్టాడు. అంతేనా, రహీమ్‌ని ఔట్‌ చేసిన ఆనందంలో వింత వింత చేష్టలు చేశాడు కోహ్లీ.

నాలికని బాగా సాగదీసేసి, అదోరకమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. క్రికెట్‌లో ఇలాంటివి కామన్‌ అయినా, బంగ్లా లాంటి జట్టుతో పోటీ సందర్భంగా, కోహ్లీ తీరు సబబేనా.? అన్న చర్చ జరుగుతోంది సోషల్‌ మీడియాలో. 

విరాట్‌ కోహ్లీ, ధోనీలా కూల్‌ కెప్టెన్‌ కాదు. మైదానంలో ఆవేశకావేశాలు చాలా ఎక్కువగానే ప్రదర్శిస్తుంటాడు. ఏ జట్టు అయినాసరే, రెచ్చగొట్టే చర్యలకు దిగితే బ్యాట్‌తో రెచ్చిపోవడమే కాదు.. మైదానంలో తనదైన చిత్ర విచిత్ర చేష్టలతోనూ రెచ్చిపోతుంటాడు.

మాజీ క్రికెటర్లు, కొంతమంది క్రికెట్‌ అభిమానులూ కోహ్లీ చర్యల్ని తప్పు పట్టడం మామూలే. అదే సమయంలో, కోహ్లీ ట్రాక్‌ రికార్డ్‌ని చూసినవారెవరైనాసరే, 'దెబ్బకు దెబ్బ తీయాల్సిందే..' అంటూ ఆయనకి మద్దతిస్తుంటారు. 

ఇప్పుడూ అంతే. బంగ్లా క్రికెట్‌ అభిమానులు సెమీస్‌లో టీమిండియా - బంగ్లా తలపడటం ఖాయమయ్యాక, వెకిలి కార్టున్లకు తెరలేపడం తెల్సిన విషయాలే. గతంలో టీమిండియా - బంగ్లాదేశ్‌ మధ్య బంగ్లాదేశ్‌లో మ్యాచ్‌లు జరిగినప్పుడూ అదే పరిస్థితి.

ఒక్క మాటలో చెప్పాలంటే క్రికెట్‌కి సంబంధించినంతవరకు పాకిస్తాన్‌ తర్వాత బంగ్లాదేశ్‌, టీమిండియాకి దాయిది దేశంగా మారిపోయింది. సో, బంగ్లాకి కోహ్లీ కౌంటర్‌ ఇవ్వడం కొంతమేర సబబే. కానీ, 'పసికూన'పై కోహ్లీ ప్రతాపం అవసరమా.? అన్నదే ప్రశ్న.

ఇక, టీమిండియా - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేష్ నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులు చేసింది. విజయం కోసం టీమిండియా 265 పరుగులు చేయాల్సి వుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీమ్, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాకిస్తాన్ తో తలపడుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?