Advertisement

Advertisement


Home > Sports - Cricket

కోహ్లీ ఐపీఎల్‌ ఎందుకు ఆడుతున్నాడు.?

కోహ్లీ ఐపీఎల్‌ ఎందుకు ఆడుతున్నాడు.?

టెస్ట్‌ క్రికెట్‌లో వరుస విజయాలు.. వన్డేల్లోనూ సత్తా చాటుతున్న వైనం.. టీ20ల్లో సరేసరి.. కానీ, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కి వచ్చేసరికి పరిస్థితులు తారుమారైపోయాయి. అత్యంత పేలవమైన ఆటతీరు. బహుశా, కోహ్లీ కెరీర్‌లోనే ఇంత చెత్త ప్రదర్శన ఇంతకుముందెన్నడూ లేదనడం అతిశయోక్తి కాదేమో.! 

ఆటగాడన్నాక ఫామ్‌ కోల్పోవడం పెద్ద విషయమేమీ కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కోహ్లీ ఇలాంటి పరిస్థితులు అప్పుడప్పుడూ చూశాడు. కానీ, మరీ ఇంత దారుణంగా మాత్రం కాదు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదో సీజన్‌కి ముందు కోహ్లీ, గాయపడ్డ విషయం విదితమే. ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా కోహ్లీకి గాయమయ్యింది. కోలుకున్నట్టే కన్పించాడు, కానీ ఐపీఎల్‌లో ఆడే విషయమై సందిగ్ధత నెలకొంది. ఎలాగైతేనేం, ఐపీఎల్‌ పదో సీజన్‌లోకి అడుగు పెట్టాడు. అంతే, అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఏం లాభం.? అభిమానుల్ని అత్యంత దారుణంగా నిరాశపర్చాడు కోహ్లీ. 

ముందే చెప్పుకున్నాం కదా.. ఆట అన్నాక అన్నీ సహజమే. ఫామ్‌లో లేకపోవడం కూడా. కానీ, కోహ్లీ అందరిలాంటోడు కాదు. అసహనం చాలా చాలా చాలా ఎక్కువ. ఆ విషయం పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది. నిన్నటి మ్యాచ్‌లోనూ అంతే. పంజాబ్‌ చివరి ఓవర్‌లో పరుగులు గట్టిగానే రాబట్టింది. అది కోహ్లీకి అస్సలు నచ్చలేదు. తనకి కొంచెం దూరంలోంచి బంతి బౌండరీకి వెళ్ళిందంతే.. కాలితో గట్టిగా విదిలించాడు కోహ్లీ. ఎందుకిలా.? అనడక్కండి. అది అతనికి సహజమే. 

మామూలు ఆటగాడైతే, ఏమో.. ఆ మాత్రం 'కసి' వుండొచ్చేమో. కానీ, కెప్టెన్‌ కదా.! కాస్తంత సంయమనం వుండాలి. కానీ, అది కోహ్లీలో కనిపించదు. అంతర్జాతీయ పోటీలు వేరు, ఐపీఎల్‌ వేరు. ఆ విషయం అందరికీ తెలుసు. ఐపీఎల్‌ మీద ఆటగాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంటారు. కోట్లు వెచ్చించి వారిని ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తుంటాయి మరి. రేప్పొద్దున్న, తన రేటు పడిపోతే అవమానం.. అన్న భావనతోనే కోహ్లీ ఇలా చేస్తున్నాడేమో.! 

టీమిండియాలో చోటు కోల్పోయిన ఆటగాళ్ళేమో ఐపీఎల్‌లో అదరగొట్టేస్తున్నారు. గంభీర్‌, ఊతప్పని చూస్తున్నాం. కోహ్లీ టీమ్‌తో పోటీ పడి పరాజయాలతో వున్న రైనా టీమ్‌నీ చూస్తున్నాం. రైనా తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. జట్టు వైఫల్యాలతో వున్నా, కోహ్లీ సైతం సరిగ్గా ఆడలేకపోతున్నాడు. చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి కోహ్లీ అసహనానికి కారణాలు. ఐపీఎల్‌ అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌.. అంతకు మించి. కానీ, కోహ్లీ ఐపీఎల్‌ వైఫల్యంతో అసహనం పెంచేసుకుంటున్నాడు. ఇది అతనికీ మంచిది కాదు, టీమిండియాకి అసలే మంచిది కాదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?