Advertisement

Advertisement


Home > Sports - Cricket

కోహ్లీని రవిశాస్త్రి తట్టుకోగలడా.?

కోహ్లీని రవిశాస్త్రి తట్టుకోగలడా.?

జంబో తట్టుకోలేకపోయాడు.. శాస్త్రి రంగంలోకి దిగాడు.! మరి, కెప్టెన్‌ కోహ్లీ సంగతేంటి.? వ్యక్తిగత ప్రయోజనాల కోసం జట్టు ప్రయోజనాల్ని తాకట్టుపెట్టడంలో తనకు సాటి ఇంకెవరూ రారన్పించుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నాడు. 'జంబో' అనిల్‌ కుంబ్లేని ఔట్‌ చేసి, అతని స్థానంలోకి టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రిని తీసుకొచ్చాడు విరాట్‌ కోహ్లీ. 

నేడు బీసీసీఐ టీమిండియా కొత్త కోచ్‌ని ప్రకటించింది. పేరుకి సౌరబ్‌ గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌లతో కూడిన సలహా సంఘం రవిశాస్త్రి పేరుని బీసీసీఐకి ప్రతిపాదించడం, బీసీసీఐ రవిశాస్త్రే తదుపరి కోచ్‌ అని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. నిజానికి, ఇక్కడా సీనియర్లకు అవమానమే జరిగింది. గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌.. కేవలం పాత్రధారులు మాత్రమే. కోచ్‌ విషయంలో పూర్తి స్థాయి నిర్ణయాలన్నీ కెప్టెన్‌ కోహ్లీనే తీసుకున్నాడు. బీసీసీఐ సైతం ఇక్కడ ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. 

కుంబ్లేతో వివాదాల కారణంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్‌ ట్రోఫీని కోల్పోవడం, అదీ దాయాది పాకిస్తాన్‌ చేతిలో టీమిండియా ఓడిపోవడం చిన్న విషయమేమీ కాదు. ఇదొక్కటి చాలు, కెప్టెన్‌ కోహ్లీ తన పంతం నెగ్గించుకునే క్రమంలో జట్టు ప్రయోజనాల్నీ, దేశ ప్రయోజనాల్నీ ఏ స్థాయిలో దెబ్బ తీశాడో చెప్పడానికి. 

'ఆటలో గెలుపోటములు సహజం..' అనేది ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ గురించి మాట్లాడేటప్పుడు అస్సలు ప్రస్తావించకూడని విషయం. ఎందుకంటే, ఆ మ్యాచ్‌లో అంతటి పేలవమైన ప్రదర్శన చేసింది టీమిండియా. కోహ్లీ ఒక్కడే కాదు, టీమిండియాలో మెజార్టీ ఆటగాళ్ళు కుంబ్లేని కోచ్‌గా వద్దనుకున్నారు.. ఆ కసితో, పాకిస్తాన్‌పై అత్యంత దారుణంగా ఓడిపోవడానికీ వెనుకాడలేదు. 

అయ్యిందేదో అయిపోయింది.. రవిశాస్త్రి వస్తున్నాడు కాబట్టి, ఇక 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, అక్కడున్నది విరాట్‌ కోహ్లీ. ఏ సమయంలో కోహ్లీ మూడ్‌ ఎలా మారిపోతుందో చెప్పడం కష్టం. కుంబ్లే లాంటోడే కోహ్లీని తట్టుకోలేకపోయినప్పుడు, రవిశాస్త్రి అయితేనేం.. ఇంకెవరైతేనేం.! 2019 వరల్డ్‌ కప్‌ వరకూ రవిశాస్త్రినే కోచ్‌.. అంటోంది బీసీసీఐ. అప్పటిదాకానా.? ఒక్క సిరీస్‌ పూర్తవనివ్వడం చూద్దాం.. అంటూ కోహ్లీ నైజం తెలిసినవారంతా రవిశాస్త్రి పట్ల జాలి ప్రదర్శిస్తున్నారిప్పుడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?