Advertisement

Advertisement


Home > Sports - Cricket

కొత్త క్రికెట్‌ హీరో కంగారుపడ్డాడు

కొత్త క్రికెట్‌ హీరో కంగారుపడ్డాడు

అతనేమీ రాత్రికి రాత్రి హీరో అయిపోలేదు.. కానీ, ఒక్క మ్యాచ్‌తో బీభత్సమైన స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాడు. దురదృష్టవశాత్తూ ఆ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలయ్యింది.

అయితేనేం, 'నువ్వే రియల్‌ హీరో..' అంటూ భారత క్రికెట్‌ అభిమానులు, ఈ సరికొత్త క్రికెట్‌ హీరోకి జేజేలు పలుకుతున్నారు. అతనెవరో కాదు, టీమిండియాకి డాషింగ్‌ ఆల్‌రౌండర్‌గా మారిన హార్దిక్‌ పాండ్యా. 

బంతి చేతికిస్తే నిప్పులు చెరిగే వేగంతో బౌలింగ్‌ చేసి ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించగలడు. బ్యాట్‌ చేతికి అందిందంటే, లాఘవంగా బంతిని స్టాండ్స్‌లోకి తరలించేయగలడు. 

కపిల్‌దేవ్‌ తర్వాత ఆ స్థాయిలో టీమిండియాకి ఫాస్ట్‌బౌలింగ్‌ చేసే ఆల్‌రౌండర్‌ లేని కోరత.. ఇప్పుడిప్పుడే తీరుతోంది హార్దిక్‌ పాండ్యా రూపంలో. మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ విశ్లేషకులు హార్దిక్‌ పాండ్యాని ఆకాశానికెత్తేస్తున్నారు.

అయితే, హార్దిక్‌ పాండ్యాలోనూ మైనస్‌లున్నాయి. మనోడికి మైదానంలో కొంచెం ఆవేశమెక్కువ. అంతేనా, మ్యాచ్‌లో జరిగే కొన్ని సంఘటనల్ని సోషల్‌ మీడియాకి ఎక్కించేస్తాడు.

హార్దిక్‌ పాండ్యా, ఆయన సోదరుడు కృణాల్‌ పాండ్యా.. ఐపీఎల్‌లో ఒకరి మీద ఒకరు సోషల్‌ మీడియాలో 'పితూరీలు' చెప్పేసుకున్నారు అభిమానులతో. అది అప్పట్లో పెద్ద రచ్చ అయ్యిందనుకోండి.. అది వేరే విషయం. 

ఇప్పుడు తాజాగా, టీమిండియా ఓటమికి జట్టులోని లుకలుకలే కారణమనే అర్థం వచ్చేలా సోషల్‌ మీడియాలో కామెంట్‌ పోస్ట్‌ చేసి కలకలం సృష్టించాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమోగానీ, ఆ ట్వీట్‌ని డిలీట్‌ చేసేశాడు.

అప్పటికే ఆ ట్వీట్‌ మెరుపు వేగంతో సోషల్‌ మీడియా అంతా చక్కర్లు కొట్టేసింది. 'యూ ఆర్‌ కరెక్ట్‌..' అంటూ భారత క్రికెట్‌ అభిమానులు కోహ్లీపైనా, ఇతర క్రికెటర్లపైనా విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా ఔట్‌ అవడానికి కారణమైన రవీంద్ర జడేజాపైనా విమర్శలు గుప్పించేశారు. 

ఇదిలా వుంటే, హార్దిక్‌ పాండ్యాకి సినీ సెలబ్రిటీలూ అభిమానులుగా మారిపోతున్నారు. తాప్సీ సహా పలువురు సినీ సెలబ్రిటీలు 'యూ ఆర్‌ రియల్‌ హీరో..' అంటూ పాకిస్తాన్‌తో టీమిండియా ఫైనల్‌లో తలపడిన మ్యాచ్‌ అనంతరం కొనియాడారు.

ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ మెరుపు అర్థ సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయిన విషయం విదితమే. పాండ్యా ఒక్కడే పాక్‌ బౌలర్లను ఎలాంటి బెరుకూ లేకుండా ఎదుర్కొన్నారు.

ట్వీట్ అయితే తీసేశాడుగానీ, అది కెప్టెన్ విరాట్ కోహ్లీ దాకా వెళ్ళకుండా వుంటుందా.? అసలే, కోచ్ కుంబ్లేతో వివాదాల కారణంగా ఫైనల్ మ్యాచ్ ని పణంగా పెట్టేశాడు కోహ్లీ. హార్దిక్ పాండ్యా ట్వీట్ కోహ్లీకి తెలిస్తే.. పాండ్యా కెరీర్ అటకెక్కిపోవడం ఖాయమేనేమో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?