Advertisement

Advertisement


Home > Sports - Cricket

మోర్తాజా మాట‌లు మ‌న‌కూ వ‌ర్తిస్తాయి

మోర్తాజా మాట‌లు మ‌న‌కూ వ‌ర్తిస్తాయి

ఇండియాలో క్రికెట్ ఆటకు దేశ‌భ‌క్తిని ఏనాడో ముడిపెట్టేశారు మ‌న అభిమానులు. ప్ర‌జ‌ల్లో జంటిల్మెన్ గేమ్ ప‌ట్ల విప‌రీతంగా పెరిగిన ఆద‌ర‌ణ‌ను వ్యాపార వ‌స్తువుగా మార్చుకుని క్రీడాకారులు, సంఘాలు కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్నారు. వీరిలో దేశం కోసం ప‌నిచేస్తున్న క్రీడాకారుల‌ను వేళ్ల‌మీద లెక్క‌పెట్ట‌వ‌చ్చు.

దేశంలో ఏ క్రీడ‌, క్రీడాకారుల‌కు ద‌క్క‌ని గౌర‌వం, హోదా, ఆదాయం క్రికెట్ ఆట‌గాళ్ల‌కు ద‌క్క‌డానికి కార‌ణం క్రీడ ప‌ట్ల దేశంలో విప‌రీతంగా పెరిగిన ఆద‌ర‌ణే. క్రికెట్లో ఇప్ప‌డిప్పుడే ఎదుగుతున్న బంగ్లాదేశ్‌లో కూడా ఇలాంటి ప‌రిస్థితే నెలకొని ఉంది.

క్రీడాకారుల‌ను అన‌వ‌స‌రంగా భుజాల‌కెత్తుకుంటున్న అక్క‌డి అభిమానుల‌కు బ్రెయిన్ వాష్ చేశారు బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మ‌ష్ర‌ఫీ మోర్తాజా. క్రికెట్‌కు దేశ‌భ‌క్తికి ముడిపెట్ట‌డం స‌రికాద‌ని సూచించారు. ఈ మాట‌లు భార‌తీయ క్రికెట్ అభిమానుల‌కు కూడా వ‌ర్తిస్తాయి.

ఛాంపియ‌న్ ట్రోఫి ఫైన‌ల్‌లో భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య పోటీ సంద‌ర్భంగా ఇరు దేశాల్లో అభిమానులు దానికి ఎంత హైప్ క్రియేట్ చేశారో, ఆట‌కు ఎన్ని సొంత అభిప్రాయాలు ఆపాదించారో చూశాం. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి పాలైన భార‌త జ‌ట్టుపై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి.

పాక్ చేతిలో ఓడి భార‌త్ ప‌రువు తీశార‌ని కొంద‌రు అత్యుత్యాహం ప్ర‌ద‌ర్శించారు. ఇలాంటి అభిమానులంద‌రికీ బంగ్లా కెప్టెన్ మోర్తాజా స‌మాధానం చెప్పారు. క్రికెట్ ఆట‌కు దేశ‌భ‌క్తికి ఎలాంటి సంబంధం లేద‌న్నారు.

ఇంకా మాట్లాడితే క్రికెట‌ర్లు దేశానికి చేసేదేమీ లేద‌ని, డ‌బ్బు తీసుకుని ఆట‌లాడే త‌మ‌ను హీరోలుగా కీర్తించ‌వ‌ద్ద‌ని అభిమానుల‌కు సూచించారు. క్రీడాకారుల‌కంటే ఎక్కువ‌గా డాక్ట‌ర్లు, కార్మికులు దేశం కోసం ప‌నిచేస్తార‌ని, వారిని కీర్తించ‌డం మంచిద‌ని కోరారు. 

మ‌ష్ర‌ఫీ మాట‌ల‌ను భార‌త అభిమానులు కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా మేధావులు, ప్ర‌ముఖులు సూచిస్తున్నారు. భార‌త్ క్రికెట్‌లో ఓడినంత మాత్రాన దేశం ఓడిన‌ట్లు కాద‌ని, దేశ ప‌రువు, మ‌ర్యాద‌లు క్రీడాకారుల చేతిలో లేవ‌న్న వాస్త‌వాన్ని గుర్తించాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు.

దేశం కోసం అనేక రంగాల్లో నిస్వార్థంగా ప‌నిచేస్తున్న వారిని కీర్తించాలి త‌ప్ప డ‌బ్బు తీసుకుని క్రికెట్ ఆడే త‌మ‌ను కాదంటూ మోర్త‌జా అస‌లైన దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శించార‌ని, భార‌త క్రీడాకారులు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాల‌ని ప‌లువురు ఆకాంక్షిస్తున్నారు. క్రికెట్ ప‌ట్ల వెర్రి అభిమానాన్ని మానుకుని దేశానికి ప‌నికొచ్చే ప‌నులు చేయాలని బంగ్లా యువ‌త‌కు సూచించ‌న మోర్తాజాను ప్ర‌శంసిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?