Advertisement

Advertisement


Home > Sports - Cricket

ఎంఎస్‌ ధోనీ: నాయకుడంటే ఇలాగే వుండాలి

ఎంఎస్‌ ధోనీ: నాయకుడంటే ఇలాగే వుండాలి

ఎవరన్నారు ధోనీ టీమిండియా కెప్టెన్‌ కాదని.! కెప్టెన్‌ పదవికి రాజీనామా చేసినా, టీమిండియాలో అనధికారిక కెప్టెన్‌ ధోనీ మాత్రమే. కెప్టెన్‌గా చివరి రోజుల్లో ధోనీ చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నాడు. ఒక్కసారి కెప్టెన్సీ వదులుకున్నాక, మళ్ళీ జూలు విదిల్చేశాడు. మైదానంలో తాను కెప్టెన్‌ని కాదని, కేవలం జట్టు సభ్యుడిని మాత్రమేనని ధోనీ అనుకోవడంలేదు. మునుపటిలానే కెప్టెన్సీ వ్యూహాల్ని తనకు తానుగా అమలుపర్చుకుంటున్నాడు. 

మామూలుగా అయితే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కొంత దూకుడు మనస్తత్వం గల వ్యక్తి. ఎవర్నీ లెక్క చేయని నైజం కోహ్లీది. కానీ, ధోనీ విషయంలోనే కోహ్లీ ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడు. మాజీ కెప్టెన్‌కి 'కెప్టెన్‌' స్థాయిలో కోహ్లీ గౌరవమిస్తుండడం విశేషమే. మరీ ముఖ్యంగా, జట్టు క్లిష్టపరిస్థితుల్లో వున్నప్పుడు కోహ్లీ, మాజీ కెప్టెన్‌ ధోనీ సలహాల్ని తీసుకుంటున్నాడు. ఇక్కడ, కోహ్లీ - ధోనీకి గౌరవమివ్వడానికీ ఓ ముఖ్యమైన కారణముంది. అదే ధోనీ, జట్టులో అత్యంత బాధ్యతగా మెలగడం. 

టీమిండియా టాప్‌ ఆర్డర్‌ కుప్ప కూలిపోయిన వేళ టెయిల్‌ ఎండర్లతో ధోనీ చూపించిన సాహసం నిన్నటి మ్యాచ్‌కే హైలైట్‌. శ్రీలంక టూర్‌లోనూ ధోనీ అదే సాహసం ప్రదర్శించాడు. 'ధోనీ రిటైర్‌మెంట్‌ అతి త్వరలోనే.. వరల్డ్‌ కప్‌ నాటికి ధోనీ జట్టులో వుండడు.. ఫిట్‌నెస్‌ని అప్పటిదాకా ధోనీ కాపాడుకోలేడు' అన్న మాటలు సాక్షాత్తూ సెలక్టర్ల నుంచే వచ్చాయి. 

కానీ, ఫిట్‌నెస్‌ విషయంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నాడు ధోనీ. జట్టుని గెలిపించడం ఒక ఎత్తు.. జట్టులోకి కొత్తగా వస్తోన్న యంగ్‌స్టర్స్‌కి స్ఫూర్తిగా నిలవడం ఓ ఎత్తు. క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్‌ని ఎలా గట్టున పడేయాలి.? తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాంటి రిస్క్‌ చేయాలి.? అన్న విషయాలకు సంబంధించి ధోనీ ఇప్పుడు ఓ 'పాఠ్యాంశం'లా మారిపోయాడు. 

నాయకుడంటే ఇలానే వుండాలి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. వరల్డ్‌కప్‌లో ధోనీ ఆడతాడా.? లేదా.? అన్నది వేరే విషయం. కానీ, అధికారికంగా 'కెప్టెన్సీ' కోల్పోయినా, 'నాయకుడి'గా తనలో సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపిస్తున్న ధోనీకి హేట్సాఫ్‌ చెప్పితీరాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?