Advertisement

Advertisement


Home > Sports - Cricket

పరువు పోయింది మహాప్రభో.!

పరువు పోయింది మహాప్రభో.!

భారత్‌ - శ్రీలంక మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ ఢిల్లీలో జరుగుతోంది. దేశ రాజధానిలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌ ఇప్పుడు భారత ప్రతిష్టను దెబ్బతీస్తోంది. నిజానికి దెబ్బ తీస్తోన్నది మ్యాచ్‌ కాదు.. మ్యాచ్‌ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు. లంక ఆటగాళ్ళు, మైదానంలో మొహాలకు మాస్క్‌ పెట్టుకుని నిన్న ఫీల్డింగ్‌ చేశారు. ఈరోజు కూడా మైదానంలో వాతావరణం కొంత ఇబ్బందికరంగానే అన్పించింది. 

ఢిల్లీ.. దేశ రాజధాని మాత్రమే కాదు.. దేశంలో కాలుష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌ కూడా. గత కొంతకాలంగా ఢిల్లీలో కాలుష్యంపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కాలుష్యం చుట్టూ వివాదాల సంగతి సరే సరి. వాహనాల నెంబర్‌ ప్లేట్ల ఆధారంగా 'సరి - బేసి' విధానాన్ని అమల్లోకి తెచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఢిల్లీ వెళుతున్నారా.. ఆరోగ్యం జాగ్రత్త.. అంటూ బంధువులకు సలహాలు ఇవ్వాల్సి వస్తోందిప్పుడు. 

ఈ మధ్యన కాలుష్యం మరీ విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని రోజులపాటు స్కూళ్ళకు సెలవులు కూడా ప్రకటించేశారు. పరిస్థితి ఎంత తీవ్రంగా వుందంటే, 'అసలు వాహనాలే బయటకు తీయొద్దు.. వీలైతే, ఢిల్లీ వదిలి వెళ్ళిపోండి..' అనే హెచ్చరికలు కూడా ముందు పుట్టుకొస్తాయేమో అనేంతలా.! 

ఇంత దారుణమైన పరిస్థితుల్లో టెస్ట్‌ మ్యాచ్‌కి ఢిల్లీ ఎందుకు వేదిక అయ్యిందట.? ప్రత్యామ్నాయ వేదిక గురించి ఎందుకు ఆలోచించలేదట.? ఇదీ కీలకమైన ప్రశ్నే. బీసీసీఐ అలసత్వం కావొచ్చు, ఇంకేదన్నా కారణం కావొచ్చు.. మ్యాచ్‌ ఢిల్లీలో జరిగింది.. భారత్‌ పరువు పోగొట్టుకుంది. సోషల్‌ మీడియా వేదికగా శ్రీలంక టీమ్‌ మీద సెటైర్లు వేస్తున్నాంగానీ, మనం మన పాలకుల్ని ప్రశ్నించలేకపోతున్నాం. ఇదీ మన దుస్థితి. 

కాలుష్యం ఎఫెక్ట్‌ లంక ఆటగాళ్ళ మీదనే కాదు, భారత ఆటగాళ్ళ మీదా చూపించింది. అశ్విన్‌ మైదానంలో ఇబ్బంది పడటం చూశాం. ఈ రోజు ఉదయం ఓ వైపు మంచు, దానికి తోడు కాలుష్యంతో భారత ఆటగాళ్ళు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆట సంగతి తర్వాత.. ఆట చూసేందుకు వచ్చిన క్రికెట్‌ అభిమానుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. దురదృష్టవశాత్తూ ఇవేవీ చర్చనీయాంశాలు కావడంలేదు. లంక మీద మన మాజీ క్రికెటర్లు సైతం నోరు పారేసుకోవడం వల్ల ఉపయోగమేంటట.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?