Advertisement

Advertisement


Home > Sports - Cricket

పోస్ట్‌మార్టమ్‌: కోహ్లీకి 'తీవ్ర' హెచ్చరిక

పోస్ట్‌మార్టమ్‌: కోహ్లీకి 'తీవ్ర' హెచ్చరిక

ఛేజింగ్‌ హీరో.. టీమిండియాకి వరుస విజయాలు అందిస్తున్న సూపర్‌ కెప్టెన్‌.. ఇలా విరాట్‌ కోహ్లీ గురించి ఇప్పటిదాకా చాలా చాలా చెప్పుకున్నాం. అన్నీ ప్లస్‌లే కాదు, మైనస్‌లు కూడా వున్నాయి కోహ్లీలో.

మైదానంలో చిన్న విషయాలకే ఎక్కువగా స్పందిస్తుంటాడు.. ఆటగాళ్ళ మీద అసహనం వ్యక్తం చేస్తుంటాడు.. ఇంకా చాలా చాలానే ఆరోపణలు ఎదుర్కొంటుంటాడు విరాట్‌ కోహ్లీ మాజీ క్రికెటర్ల నుంచి, క్రికెట్‌ పండితుల నుంచీ.

విజయాలు దక్కినప్పుడు ప్రశంసలు, ఫెయిల్యూర్స్‌ వచ్చినప్పుడు విమర్శలూ మామూలే. ఆట అన్నాక గెలుపోటములు సహజం. కానీ, ఓటమి అత్యంత పేలవంగా వున్నప్పుడే విమర్శల తీవ్రత మరింత ఎక్కువవుతుంది.

కోహ్లీ, ఇప్పుడందుకే తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. భారత క్రికెట్‌ అభిమానుల్లో కొందరు, ఆవేశం అణచుకోలేక.. క్రికెటర్ల దిష్టిబొమ్మల్ని తగలబెడ్తున్నారు.. తమ ఇంట్లో టీవీ సహా ఇతర వస్తువుల్ని ధ్వంసం చేసి, తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

'ఓటమి ఎంత కష్టమైనదో తెలుసు.. మాపై వున్న అంచనాల్ని మేం నిలబెట్టుకోలేకపోయాం..' అన్న ఒక్క మాటతో, కోహ్లీ 'తప్పిదాలనుంచి' తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఆ సంగతి కోహ్లీకి కూడా తెలుసు.

క్రికెటర్ల ఇంటిదగ్గర భద్రత పెంచడం ఇలాంటి సందర్భాల్లో సర్వసాధారణం. అతి అభిమానమే అందుక్కారణం. పైగా, ఓడిపోయింది ఇలాంటి టోర్నీల్లో అత్యంత పేలవమైన రికార్డున్న పాకిస్తాన్‌ మీద. అది దాయాది దేశం కదా.. అందుకే, అభిమానుల ఆవేదన ఇంత తీవ్రంగా వుందన్న విషయాన్నీ కాదనలేం.

అయ్యిందేదో అయిపోయింది.. ఈ పరాజయం నుంచి కోహ్లీ చాలా పాఠాలు నేర్చుకోవాలి. జట్టులో సీనియర్ల నుంచి సలహాల్ని తీసుకోవడం తప్పనిసరి. మైదానంలో ఎప్పటికప్పుడు వ్యూహాల్ని మార్చుకోవాల్సిందే.

కోచ్‌తో విభేదాలు జట్టుని దారుణంగా దెబ్బతీస్తాయనీ కోహ్లీ అర్థం చేసుకోవాలి. అన్నిటికీ మించి కెప్టెన్‌గా 'సహనం' ఎలా ప్రదర్శించాలో, జట్టులోనే వున్న 'మిస్టర్‌ కూల్‌' ఎంఎస్‌ ధోనీని చూసి అలవాటుచేసుకోవాలి.

కోల్పోయింది జస్ట్‌ ఓ మ్యాచ్‌ని మాత్రమే కాదు.. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని. కెప్టెన్‌గానూ, బ్యాట్స్‌మెన్‌గానూ తాను వైఫల్యం చెందడం జట్టుని ఏ స్థాయిలో నిండా ముంచేసిందో 'పోస్ట్‌మార్టమ్‌' చేసుకోకుండా వుండడు కోహ్లీ.

ఈ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటే, ముందు ముందు టీమిండియాకి బెస్ట్‌ కెప్టెన్‌గా కోహ్లీ మరింతగా ఉపయోగపడ్తాడనడం నిర్వివాదాంశం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?