Advertisement

Advertisement


Home > Sports - Cricket

టీమిండియాకి ఏమయ్యింది.?

టీమిండియాకి ఏమయ్యింది.?

ఆట అన్నాక గెలుపోటములు సహజం. ఒక్క ఓటమితోనే విమర్శలు చేసేయడం సబబు కాదు. కానీ, ఆ ఓటమి అత్యంత ఘోరమైన ఓటమి అయితేనే విమర్శలు తప్పవు. ఇప్పుడు టీమిండియాకి విమర్శలు వెల్లువెత్తుతున్నాయంటే కారణం, ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఘోర పరాభవం ఎదుర్కోవడం వల్లే. 

అలాంటిలాంటి ఓటమి కాదిది. అత్యంత ఘోరమైన ఓటమి. జట్టులో ఏ ఆటగాడూ సెంచరీ చేయలేదు సరికదా.. మొత్తంగా టీమిండియా స్కోర్‌ 100 దాటడంతో అమ్మయ్యా.. అనుకోవాల్సిన దుస్థితి. తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులు. ఇదీ పూణేలో టీమిండియా, ఆస్ట్రేలియాతో తలపడ్డ టెస్ట్‌ మ్యాచ్‌లో స్కోర్లు. అదే ఆసీస్‌ జట్టు తీసుకుంటే, తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. ఇరు జట్లకీ ప్రధానమైన తేడా ఇదే. 

భారత బౌలర్లూ 20 వికెట్లు తీశారు, ఆసీస్‌ బౌలర్లూ 20 వికెట్లు తీశారు. కానీ, తక్కువ పరుగులిచ్చి ఆసీస్‌ బౌలర్లు 20 వికెట్లు తీస్తే, కాస్త ఎక్కువ పరుగులిచ్చి భారత బౌలర్లు 20 వికెట్లు తీశారు. భారత స్పిన్నర్ల కంటే ఆసీస్ స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీయడం మరో విశేషం. కాస్త నిలబడితే, పరుగులు రాబట్టడం మరీ అంత కష్టమేమీ కాదని ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ నిరూపించారు. భారత బ్యాట్స్‌మెన్‌ మాత్రం, అస్సలు నిలబడ్డానికే ప్రయత్నించలేదు. అదే టీమిండియా కొంప ముంచేసింది. ఆసీస్‌ కెప్టెన్‌ ఓ సెంచరీ చేశాడు.. టీమిండియా కెప్టెన్‌ కనీసం అర్థ సెంచరీ చేయలేకపోయాడు. 

ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే, తొందపడి టీమిండియా 'రివ్యూలు' వాడేసుకుంది. వాటిల్లో ఎక్కువ ఫ్లాపులే. అదే ఆసీస్‌ విషయానికొస్తే, జాగ్రత్తగా వ్యవహరించింది.. ఫలితాన్ని తమకు అనుకూలంగా రాబట్టుకుంది. కేవలం మూడంటే మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసిపోయింది. మూడు రోజులు కూడా పూర్తిగా జరగకుండానే మ్యాచ్‌ ముగిసిందంటే.. పిచ్‌ ఎంతలా వుందో అర్థం చేసుకోవచ్చు. 

చెప్పుకుంటూ పోతే, టీమిండియా - పూణే టెస్ట్‌లో ఓటమి చవిచూడటానికి చాలా కారణాలే వున్నాయి. కారణాలు వెతుక్కోవడం అనవసరం. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియాకి ఇది దిమ్మ తిరిగే షాక్‌. ఆసీస్‌ని అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. టీమిండియాకి సొంత గడ్డ మీద బలం వున్నా, ఆసీస్‌ ఎప్పుడెలా పుంజుకుంటుందో ఊహించడం కష్టం. టీమిండియా నుంచి ముందు ముందు మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శనను ఆశిద్దాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?