Advertisement

Advertisement


Home > Sports - Cricket

దటీజ్‌ సచిన్‌ టెండూల్కర్‌

దటీజ్‌ సచిన్‌ టెండూల్కర్‌

హెల్మెట్‌ పెట్టుకోండి మొర్రో.. అంటూ ట్రాఫిక్‌ పోలీసులు ఎంతలా ప్రచారం చేస్తున్నా జనం పట్టించుకోవడంలేదు. చలాన్లు విధిస్తోంటే, కట్టేస్తున్నారంతే. అందరూ అని కాదుగానీ, చాలామందికి హెల్మెట్‌ అంటే అదొక అలర్జీ అన్నంతలా ఫీలయిపోతున్నారు. అఫ్‌కోర్స్‌.. కొన్ని ప్రమాదాల్లో హెల్మెట్‌ కూడా ప్రాణాల్ని కాపాడలేదనుకోండి.. అది వేరే విషయం. అయితే చాలావరకు ప్రమాదాల్లో హెల్మెట్‌ ప్రాణాల్ని కాపాడుతోంది కాబట్టి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ని ధరించడం తప్పనిసరి. 

ఇదే విషయాన్ని క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ చెప్పాడు. అదీ హైద్రాబాద్‌లో. అందునా, మాంఛి ట్రాఫిక్‌ సమయంలో. సిగ్నల్‌ వద్ద తన కారు ఆగడంతో, సచిన్‌ కారు గ్లాస్‌ దించి మరీ, అక్కడే ట్రాఫిక్‌లో బైక్‌ మీదున్న కుర్రాడితో, 'హెల్మెట్‌ తప్పనిసరి.. అది నీ జీవితాన్ని కాపాడుతుంది..' అంటూ క్లాస్‌ తీసుకున్నాడు. ముందు షాక్‌కి గురయ్యాడా కుర్రాడు. తర్వాత సచిన్ చెప్పిన మాటల్ని విన్నాడు. హెల్మెట్ ఇకపై పెట్టకుంటానని చెప్పాడు. ఇంకోపక్క, 'సెల్ఫీ పిచ్చి' పీక్స్‌కి వెళ్ళిపోయింది. హెయిర్‌ స్టైల్‌ సరిచేసుకుంటూ కారులోనే వున్న సచిన్‌తో బైక్‌ మీదనుంచే ఇంకో ఔత్సాహికుడు సెల్ఫీ కోసం పాకులాడాడు. 

ఈ మొత్తం తతంగం సచిన్‌ టెండూల్కర్‌, ఓ వీడియోలో బంధించి, సోషల్‌ మీడియాలో పెట్టాడు. క్షణాల్లో కుప్పలు తెప్పలుగా లైక్స్‌, షేరింగ్స్‌ వచ్చేశాయనుకోండి.. అది వేరే విషయం. సచిన్‌ చెప్పిన నీతులు బాగానే వున్నాయిగానీ, రాజ్యసభ సభ్యుడిగా.. అప్పుడప్పుడూ రాజ్యసభకు వెళ్ళి రావయ్యా.. అంటూ సచిన్‌కి ఇంకోపక్క క్లాసులు తీసుకుంటున్నారు జనం.! 

సచిన్‌కి సెటైర్లేయడం సంగతి అలా వుంచితే, ఊపిరాడని హైద్రాబాద్‌ ట్రాఫిక్‌లో సచిన్‌, కారు గ్లాస్‌ డౌన్‌ చేయడమే గొప్ప విషయం. పైగా, హెల్మెట్‌ అవసరం గురించి ద్విచక్రవాహనారులకు క్లాస్‌ తీసుకోవడం మరీ విశేషం. కాదంటారా.? దటీజ్‌ సచిన్‌ టెండూల్కర్‌.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?