Advertisement

Advertisement


Home > Sports - Cricket

వారెవ్వా రో'హిట్‌': 3వ డబుల్‌ సెంచరీ

వారెవ్వా రో'హిట్‌': 3వ డబుల్‌ సెంచరీ

వన్డేల్లో డబుల్‌ సెంచరీ అంటే అదేమీ చిన్న విషయం కాదు. కానీ, అలవోకగా డబుల్‌ సెంచరీలు నమోదు చేసేస్తున్నాడు రోహిత్‌ శర్మ. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా కెరీర్‌లో మూడో డబుల్‌ సెంచరీని వన్డేల్లో నమోదు చేసి, ఇంకెవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డ్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు రోహిత్‌ శర్మ. 

కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ని లంక చేతిలో దారుణంగా పోగొట్టుకున్న రోహిత్‌ శర్మ, రెండో మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయాడు. సెంచరీ చేయడానికి 100కి పైగా బంతుల్ని తీసుకున్న రోహిత్‌, మిగతా వంద పరుగుల్ని కేవలం 36 బంతుల్లో పూర్తి చేయడం గమనార్హం. రోహిత్‌ శర్మ ధాటికి మొహాలీ మైదానంలో సిక్సర్ల మోత మోగిందనడం అతిశయోక్తి కాదేమో. రోహిత్‌ దూకుడుతో లంక బౌలర్లకు తమ బంతుల్ని ఎక్కడ సంధించాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. 

నిజానికి చాలా నెమ్మదిగా టీమిండియా ఇన్నింగ్స్‌ ప్రారంభమయ్యింది. క్రమక్రమంగా ఓ ఎండ్‌లో శిఖర్‌ ధావన్‌ దూకుడు పెంచుతోంటే, రోహిత్‌ శర్మ మాత్రం ఆచి తూచి అడుగులేశాడు. శిఖర్‌ ధావన్‌ ఔట్‌ అయ్యాక, రోహిత్‌ శర్మ కాస్త వేగం పెంచాడు. ధావన్‌ ప్లేస్‌లోకి శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చాక మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. ఓ వైపు శ్రేయస్‌, ఇంకో వైపు రోహిత్‌ శర్మ వీర బాదుడు బాగేశారు.

అయితే శ్రేయస్‌ అయ్యర్‌ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 70 బంతుల్లో 88 పరుగులు చేశాడు శ్రేయస్‌ అయ్యర్‌. చివర్లో ధోనీ 7 పరుగులు చేసి ఔట్‌ అయితే, హార్దిక్‌ పాండ్యా 8 పరుగులకు ఔట్‌ అయ్యాడు. 208 పరుగులతో రోహిత్‌ శర్మ నాటౌట్‌గా నిలిచాడు. 

వన్డేల్లో టీమిండియా తరఫున ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్‌, సెహ్వాగ్ డబుల్‌ సెంచరీలు సాధించిన విషయం విదితమే. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264 పరుగుల రికార్డ్ రోహిత్ పేరు మీదే వుంది. అది కూడా లంకపైనే రోహిత్ సాధించడం గమనార్హం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?