మళ్లీ కొత్త ఈక్వేషన్లకు తెరలేస్తోంది. పూరి జగన్నాధ్ ను చరణ్ తో లింక్ చేసి, సినిమా చేసే అవకాశాలకు పురుడుపోస్తున్నారు కొందరు. ఇప్పుడు చరణ్ కు మాంచి కమర్షియల్ సినిమా అవసరమని, అది పూరి మాత్రమే ఇవ్వగలడని చెబుతున్నారు.
చిరుత తరువాత పూరి చరణ్ తో సినిమా చేయలేదు. పైగా ఇప్పుడు మెగా క్యాంప్ తో పూరికి మరీ అద్భుతమైన సంబంధాలు లేవు. కెమేరా మెన్ గంగతో రాంబాబు తరువాత పవన్ కు దూరమయ్యాడు. చిరంజీవి 150 వ సినిమా బెడిసి కొట్టింది.
అయినా, కూడా, పూరితో సినిమా చేస్తే బాగుంటుందన్న సూచనలు రామ్ చరణ్ దృష్టి కి కొందరు తీసుకెళ్లినట్లు వినికిడి. రామ్ చరణ్ కు సరిపడే మాంచి లైన్ పూరి దగ్గర వుందని చెప్పి, వారిద్దరి సమావేశానికి మార్గం సుగమం చేస్తున్నారని తెలుస్తోంది.
ఇదిలా వుంటే కత్తి సినిమా రీమేక్ ను ఆపి, లేదా పక్కన పెట్టి, వివి వినాయక్ తో రామ్ చరణ్ సినిమా చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. థని ఒరువన్ ఇప్పుడు ఇమ్మీడియట్ సినిమాగా వద్దు అన్న సూచనలు కూడా చరణ్ కు అందుతున్నాయని టాక్.
ఇదిలా వుంటే రచ్చ లాంటి హిట్ ఇచ్చి, ఇప్పుడు బెంగాల్ టైగర్ తో పాజిటివ్ ట్రెండ్ లోకి వచ్చిన సంపత్ నంది అయితే ఎలా వుంటుందీ అన్న అయిడియా కూడా వుందట.
అయితే సంపత్ నంది పేరుకు, బాబాయ్ పవన్ కళ్యాణ్ అప్రూవల్ కావాల్సి వుంది. పవన్ దృష్టిలో, ఆయన నిర్మించే సినిమాకు హరీష్ శంకర్ పేరు కూడా పరిశీలనలో వుందనిపిస్తోంది.