నేటి స్టార్ హీరోల వారసుల్లో చాలా మందికి డ్యాన్సుల్లో, ఫైట్స్‌లో, నటనలో మంచి శిక్షణే పొందుతున్నారు. దాని ఫలితాన్ని, తమ శ్రమ గొప్ప తనాన్ని తెరమీద ఆవిష్కరిస్తున్నారు. అయితే వీరిలో లోపించింది ఏమిటంటే… నలుగురిలో ముఖ్యంగా మాస్లో మమేకమై పోయే గుణం అంతగా లేకపోవడం. గోల్డ్ స్పూన్‌తో పుట్టడం వల్లనో, స్టార్ హీరో స్టేటస్ నీడలో పెరగడమో గాని… వీరిలో ఎవరూ అందరిలో ఒక్కడు అనిపించేలా ఉండరు. మొన్నటి మహేష్, పవన్ ల దగ్గర్నుంచి ప్రభాస్, రామ్ చరణ్‌ల దాకా అందరిదీ అదే తీరు.
అయితే ఈ ట్రెండ్‌ను అఖిల్ బ్రేక్ చేస్తాడేమో అనిపిస్తోంది అతని తీరు చూస్తుంటే. తాజాగా ఈ యువ హీరో హైదరాబాద్, బేగంపేటలోని సెయింట్ ప్రాన్సిస్ కాలేజ్‌లో జరిగిన ఒక ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అమ్మాయిలతో, అక్కడ తనను కలిసిన వారితో అతను మమేకమైపోయిన తీరు చూసిన వారికి ఆశ్చర్యం కలిగించింది.
విద్యార్ధులతో సరదాగా మాట్లాడుతూ, వారితో సెల్ఫీలు దిగుతూ చాలా సేపు సందడి చేసిన అఖిల్… టచ్ మీ నాట్లా ముడుచుకుపోయే టాలీవుడ్ యువ హీరోలకు భిన్నంగా వీరిలో ఒకడిగా కలిసిపోయాడు. సెల్ఫీ స్టిక్ తీసుకుని తనే ఫొటోలు తీశాడు. దీంతో కాసేపట్లోనే అమ్మాయిలంతా అతడో పెద్ద హీరో తనయుడు, కాబోయే హీరో అనే ఫీలింగ్‌ను పక్కన పెట్టేసి అఖిల్‌తో కబుర్లు సాగించారు
ఈ ఒక్క ఈవెంట్ అనే కాదు గత కొంతకాలంగా స్టార్ క్రికెట్ సహా సినిమాకు సంబంధం లేని రకరకాల కార్యక్రమాల్లో అఖిల్ పాల్గొంటున్నప్పుడు ఇదే తరహా స్టైల్‌తో ఆకట్టుకుంటున్నాడు. నిజానికి ఇలాంటి స్టైల్ బాలీవుడ్ హీరోల్లో బాగా కనపడుతుంది. అక్కడ అవసరమైతే సినిమా ప్రమోషన్ కోసం షారూఖ్ ఖాన్ రేంజ్ హీరోలు గల్లీల్లో డ్యాన్సులకు సైతం సైఅంటారు. హీరోయిన్లు కూడా అంతే హుషారుగా జనంతో కలిసి పోతారు. మన తెలుగు హీరోలు మాత్రం అంతగా జనానికి చేరువ కావడానికి ఆసక్తి చూపరు.
ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొన్నా స్టేజి మీంచి దిగడానికి కూడా ఇష్టపడరు.తామేదో వేరే ప్రపంచం నుంచి వచ్చినవాళ్లం అన్నట్టు ఉంటారు. చిరంజీవి జనరేషన్ దాకా ఈ తరహా స్టైల్ ఓకె గాని ఇప్పుడు నటులు తెరమీద మాత్రమే కాదు బయట కూడా తన ప్రవర్తనతో జనాన్ని ఆకట్టుకోవాల్సిన అవసరం పెరిగింది. అది అఖిల్ బాగానే అర్ధం చేసుకున్నట్టున్నాడు.