టీడీపీ కోసం బీజేపీ నేత ఆరాటం!

బీజేపీకి టీడీపీతో పొత్తు కుదుర్చుకోవాలని లేదు అన్నది తేటతెల్లమవుతోంది. తెలంగాణాలో బీజేపీ జనసేనతో అయినా పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది కానీ కాస్తో కూస్తో ఓట్లు ఉన్న టీడీపీ జోలికి వెళ్ళడం లేదంటేనే ఆలోచించాలి. Advertisement…

బీజేపీకి టీడీపీతో పొత్తు కుదుర్చుకోవాలని లేదు అన్నది తేటతెల్లమవుతోంది. తెలంగాణాలో బీజేపీ జనసేనతో అయినా పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది కానీ కాస్తో కూస్తో ఓట్లు ఉన్న టీడీపీ జోలికి వెళ్ళడం లేదంటేనే ఆలోచించాలి.

అయినా సరే ఆశ చావని వారు బీజేపీలో చాలా మంది ఉన్నారు. వారిలో ముందు వరసలో విశాఖకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఉన్నారని అంటున్నారు. వైసీపీకి ఓడించడానికి సిద్ధాంతాలు అన్నీ పక్కన పెట్టి పార్టీలు అన్నీ కలవాలని రాజు గారు తాజాగా పిలుపు ఇస్తున్నారు.

ఆయన దృష్టిలో అన్ని పార్టీలు అంటే బీజేపీ అని భావించాలని అంటున్నారు. బీజేపీ- టీడీపీ- జనసేన కలిస్తే ఏపీలో కమలానికి కొంత అయినా కాంతులు వస్తాయని ఆ పార్టీలోని కొందరు భావిస్తున్నారు. విశాఖలో ఈ పొత్తుల వల్లనే 2014 ఎన్నికల్లో గెలిచిన విష్ణు కుమార్ రాజు ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ కావాలని కోరుకుంటున్నారు.

వైసీపీని గద్దె దించాలంటే అంతా ఒక్కటి కావాలని కూటమి కట్టాలని ఆయన ఇస్తున్న పిలుపు బాగానే ఉన్నా వైసీపీని దించితే తమకేంటి అని బీజేపీ లాంటి పార్టీలు కూడా ఆలోచించుకుంటాయి కదా అని అంటున్నారు. బీజేపీ వరకూ చూస్తే ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా పోయేది లేదు వచ్చేదీ లేదు. పైగా తనకు బాగానే ఉంటుంది అని అంటున్నారు. రాజకీయ గణితంలో ప్లస్ మైనస్ మాత్రమే ఉంటాయి. ఈ లెక్కలకు మించి హెచ్చివేతలు భాగించడాలు ఉండవని అంటున్నారు.

తెలుగుదేశంతో బీజేపీ కలవాలీ అనుకుంటే అది ఢిల్లీ స్థాయిలో తీసుకునే నిర్ణయం. కేంద్ర పెద్దలకు ఏపీలో ఏమి చేయాలో చేయకూడదో బాగా తెలుసు అంటున్నారు. అయినా సరే పొత్తులతో తమ సీట్లు పదిలం అనుకుంటున్న కమలనాధులు మాత్రం పార్టీ ఎదుగుదల సంగతి తరువాత భావిస్తున్నారా  అన్న డౌట్లు వస్తున్నాయి. బీజేపీ- టీడీపీ పొత్తు అన్నది ఇపుడు టీడీపీకి కూడా ఇష్టం ఉందో లేదో కదా అన్న కొత్త ప్రశ్నలూ పుట్టుకుని వస్తున్న వేళ రాజు గారి ఆరాటం మాత్రం అంతకంతకు పెరిగిపోతోంది.