ఒక సినిమా విజయానికి ప్రాతిపదిక ఏమిటి? అంటే.. ఈ ప్రశ్నకు సమాధానాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సినిమా విజయానికి కూడా నిర్వచనం మారిపోతూ ఉంటుంది. సినిమా విషయంలో జనాల వ్యూ మారిపోతుండటమే దీనికి కారణం. ఒకప్పుడు ఒక సినిమా ఎక్కువ రోజులు ఆడితే విజయం సాధించినట్టు. విడుదల అయిన సినిమా యాభైరోజులు, వంద రోజులు, 175రోజులు, 365రోజులు, 500రోజులు.. ఇలా ఆడుతూ పోతుండటమే. ఇలా వందలకు వందల రోజులు ప్రేక్షకుల మధ్యన ఉండమే.. ఇదే సినిమా విజయానికి నిర్వచనం. ఎన్నిరోజులు ఆడితే అంత పెద్దహిట్.
ఆ తర్వాత సినిమా రేంజ్ పెరిగింది. ప్రజలకు ప్రధానమైన ఎమ్యూజ్మెంట్గా మారింది సినిమా. ఫలితంగా థియేటర్ల సంఖ్య పెరిగింది. సినిమాలను చూసేవాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో థియేటర్ల సంఖ్య.. ఆడేరోజులు.. సినిమా విజయానికి నిర్వచనాలుగా మారాయి. వీలైనన్ని థియేటర్లు, వీలైనన్ని రోజులు.. సాగడమే సినిమా విజయానికి ప్రాతిపదిక అయ్యింది.
తర్వాత కలెక్షన్ల లెక్కలు.. ఒక సినిమా ఎక్కువరోజులు ఆడిందంటే, ఖాళీ థియేటర్లలో కాదు కదా, ప్రేక్షకులు రావాలి. వాళ్లు టికెట్లు కొనాలి.. ఓవరాల్‌గా ఎంతడబ్బు వచ్చిందో అదీ విజయానికి నిర్వచనాన్ని ఇస్తుంది. దశాబ్దాల కిందటే కలెక్షన్ల లెక్కలు ఉన్నా.. అప్పటి పరిస్థితులకు రీత్యా.. లాంగ్రన్ మాత్రమే సినిమాల విజయానికి రుజువుగా నిలిచింది. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. థియేటర్ల సంఖ్యలు పెరిగిపోయాయి.
ప్రపంచీకరణ ప్రభావమే అనుకోవాలో.. 90ల తర్వాత థియేటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మండలస్థాయి థియేటర్లలో కూడా సినిమాల విడుదల మొదలైంది. అంతకు ముందు రిలీజ్ సినిమాలు అంటే అవి జిల్లా హెడ్క్వార్టర్లకే పరిమితం అనే దగ్గర నుంచి… భారీ సంఖ్య థియేటర్లలో సినిమాలు విడుదలకావడం, అంతేస్థాయిలో యాభైరోజులు, వందరోజుల రన్ సాధించడం.. వీలైతే 175రోజుల లెక్కలు పోస్టర్లలో వేయడం ఒకదశలో ట్రెండ్‌గా నిలిచింది.
ప్రత్యేకించి 1997ల నుంచి 2005ల మధ్యన ఈ రకమైన తీవ్రమైన పోటీ నడిచింది. స్టార్ హీరోల సినిమాలు ఎన్ని థియేటర్లలో 50రోజులను పూర్తి చేసుకన్నాయి, వందరోజులకు ఎన్ని థియేటర్లలో నిలిచాయి.. 175 డేస్‌కు ఎన్ని థియేటర్లను బ్లాక్ చేశాయి.. అనేవి అప్పట్లో రికార్డులుగా నిలిచాయి. ఒక హీరో సినిమాను మించిపోయే రీతిలో మరో సినిమా అలాంటి రికార్డులను క్రియేట్ చేస్తూ వచ్చింది. అందులో పెద్ద రాజకీయమే నడిచింది. అయితే రోజులు ఎప్పుడూ ఒకలా ఉండవు కదా.. మారాయి. ప్రత్యేకించి ఇంటర్నెట్ విప్లవం వచ్చాకా కథంతా మారిపోయింది.
ఇంటర్నెట్ కన్నా ముందు వచ్చిన సీడీలు, డీవీడీలు.. సినిమాల లాంగ్‌రన్‌కు ప్రతిబంధకాలుగా నిలిచాయి. పైరసీ వచ్చింది. వీసీపీలు.. ఊరికొకటి ఉండేవి, కానీ సీడీ ప్లేయర్లు ఇంటికి ఒకటి అయిపోయాయి. వాటి దెబ్బకు పైరసీ సీడీలకు గిరాకీ పెరిగింది. ఆ దెబ్బకు పెద్ద హీరోల సినిమాలు కూడా తట్టుకోలేకపోయాయి. 2005, 2006ల సమయాలకే పెద్దహీరోల సినిమాలకు కూడా కష్టకాలం మొదలైంది. పైరసీ సీడీలు రాజ్యం ఏలుతుండటంతో థియేటర్ల వద్ద మూవీ లాంగ్రన్ తగ్గిపోయింది. ఇక ఇంటర్నెట్ వీరవిహారంతో ఖేల్‌ఖతం. విడుదల అయిన రోజునే పైరసీ విహారం.
ఇదే సమయంలో సినిమా హిట్‌కు కూడా నిర్వచనం మారిపోయింది. వందరోజుల నుంచి వారానికి మారిపోయింది వ్యవధి. తొలివారంలో ఎంత సాధించింది? అనేదొక్కటే సినిమా విజయానికి నిరూపణగా మారింది. ఈ నంబర్ల గందరగోళంలో నిజాలు ఏమిటో, అబద్ధాలు ఏమిటో కానీ.. సామాన్యుడికి అర్థంకాని నంబర్లే సినిమాల విజయానికి రుజువులుగా మారాయి. ఇదీ నేటి ట్రెండ్.
మరి ఈ ట్రెండ్‌లో మరి కొన్ని విడ్డూరాలూ నడుస్తున్నాయి. థియేటర్ల వద్ద ఫెయిల్యూర్స్ అని రివ్యూయర్లు, ట్రేడ్ వర్గాలు నిర్ణయించిన సినిమాలు.. మరోచోట మాత్రం సత్తా చాటుతున్నాయి. ఇది ఇంటర్నెట్లో.. యూట్యూబ్‌లో..! ఈ సినిమాలు విడుదల అయినప్పుడు నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. తొలివారం వరకూ కాదు కదా, కనీసం తొలిరోజు కూడా ఇవి థియేటర్ల వద్ద సరిగా కనిపించలేదు. కానీ.. యూట్యూబ్‌లో మాత్రం లాంగ్రన్ను సాధిస్తున్నాయి. లక్షలమంది ఈ సినిమాను చూశారు.. చూస్తున్నారు.. చూస్తూనే ఉన్నారు.
ఈ మధ్య కాలంలో విడుదల అయిన అలాంటి సినిమాల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. ఈ ఆసక్తికరమైన పరిణామం అర్థం అవుతుంది. ఆ మధ్య సందీప్ కిషన్ సినిమా ఒకటి వచ్చింది 'నగరం' అని. చాలా మందికి ఆ సినిమా ఒకటి వచ్చి వెళ్లిందని తెలీదు. తమిళంలో ఈ సినిమాను రూపొందించగా.. తెలుగులోకి అనువదించారు. పక్కా తమిళ వాసనతో రూపొందించిన ఈ సినిమా మనవాళ్లకు ఎక్కలేదు. ఇదీ థియేటర్ వద్ద రిజల్ట్ కానీ.. ఇదే సినిమాను యూట్యూబ్‌లో పెడితే ఇప్పటికే 23లక్షల మంది వీక్షించారు. ఒక్క నెలరోజుల వ్యవధిలో ఇంత మంది ఈ సినిమాను చూశారు!
ఇక ఇదే హీరో సినిమా.. 'ఆ ఒక్క అమ్మాయి తప్పా'. తొలి రోజునే నెగిటివ్ రివ్యూలను ఎదుర్కొన్న సినిమా ఇది. థియేటర్ల వద్ద అట్టర్‌ఫ్లాప్. కానీ యూట్యూబ్‌లో కాదు. కేవలం 15రోజుల్లోనే ఆ సినిమా ఇరవై లక్షల పైగా వ్యూస్‌ను సాధించింది. బహుశా ఈ రెండు సినిమాలనూ థియేటర్లలో ఇంత మంది చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ ఇన్ని లక్షలమంది థియేటర్లలో చూసి ఉంటే.. ఒక్కో టికెట్‌కు 50రూపాయల ధరతో లెక్కేసినా.. ఒక్కో సినిమా కనీసం పదికోట్ల రూపాయల పైస్థాయి వసూళ్లను సాధించేవి!
కేవలం ఈ రెండేకాదు.. మినిమం గ్యారెంటీ హీరోల సినిమాలు యూట్యూబ్‌లో సూపర్ హిట్టుగా నిలుస్తున్నాయి. తమిళ దర్శకుడు చేరన్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఒక సినిమా వచ్చింది. దాని పేరు తెలుగులో 'రాజాధిరాజా'. థియేటర్లలో ఈ సినిమా విడుదల కావడం వివాదం అయ్యిందప్పట్లో. దీని థియేటరికల్ విడుదల ప్రచారానికి శర్వానంద్ ముందుకు కూడా రాలేదు. యూట్యూబ్‌లో అలాంటి అవసరం లేకపోయింది. ఈ సినిమాను ఏకంగా 71లక్షల మంది వీక్షించారంటే.. యూట్యూబ్ ద్వారా సినిమాలు ఎంతమందికి చేరువ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రిపీటియడ్ ఆడియన్స్ లేకపోతే ఏ సినిమా అయినా 71లక్షల మందిని రీచ్ కావడం సాధ్యంకాకపోవచ్చు. కాబట్టి.. ఈ సినిమా మంచి విజయం సాధించినట్టే. థియేటర్లలో కనీసం ఏడువేల మంది కూడా చూడని సినిమా 71లక్షల వ్యూస్‌ను సంపాదించింది యూట్యూబ్‌లో.
ఈ యూట్యూబ్ వ్యూస్‌లో తెలుగులో కనీస గుర్తింపు ఉన్న పక్క భాషల స్టార్లు ఒక వెలుగు వెలుగుతున్నారు. దుల్కర్ సల్మాన్, అనుపమా పరమేశ్వరన్ నటించిన 'అందమైన జీవితం' అనే సినిమా వారంరోజుల్లో 15లక్షల వ్యూస్‌ను సంపాదించింది. ఇలాంటి సినిమా ఒకటి థియేటర్ల వద్దకు వచ్చిందని ఎవరీకీ తెలీదు. అయినా యూట్యూబ్‌లో ఇది సంచలన విజయం సాధించింది. రంగం-2 దాదాపు నలభైలక్షల వ్యూస్‌ను సంపాదించింది. ఇదే సినిమా థియేటర్ల వద్ద నాలుగులక్షల రూపాయలను కూడా వసూలు చేయలేదు.
శ్రీనివాసరెడ్డి సినిమా 'జయమ్ము నిశ్చయమ్మురా' యూట్యూబ్‌లో అప్లోడ్ అయిన నెలరోజుల్లో 36లక్షల హిట్స్‌ను సంపాదించింది. తమన్నా అభినేత్రి అరకోటి పైస్థాయి వ్యూస్‌ను సంపాదించింది.
హిట్ అయిన సినిమా యూట్యూబ్‌లో హిట్స్‌ను సంపాదిస్తే అదోలెక్క. కానీ విడుదల అయ్యాయో కూడా తెలియని సినిమాలు, థియేటర్ల వద్ద ఏమాత్రం ఆకట్టుకోని సినిమా యూట్యూబ్‌లో బంపర్ హిట్స్ అవుతున్నాయి. కానీ ఇలాంటి ఫీచర్ ఫిల్మ్స్ యూట్యూబ్‌లో ఆడటం వల్ల నిర్మాతలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. యాడ్స్ ద్వారా వచ్చే మొత్తం స్వల్పమే కావొచ్చు. కానీ సదరు సినిమా పట్ల ప్రేక్షకుల ఇష్టానికి, ఆ సినిమా ఏదో విధంగా ప్రేక్షకులకు చేరువైందని చెప్పడానికి రుజువులుగా నిలుస్తున్నాయి ఈ గణాంకాలు.