పవన్ కాళ్ల దగ్గర త్రివిక్రమ్

హమ్మయ్య. ఓ పనైపోయింది. కొడకా కొటీశ్వర్రావా- కరుసైపోతవురో-దోసైపోతవురో-చెత్తయిపోతవురో – మట్టయిపోతవురో..అంటూ తిట్ల దండకాన్ని పాటగా మార్చి పవన్ చేత పాడించిన పాట బయటకు వదిలేసారు. పాట, ట్యూన్ ఇంతరత్రా వ్యవహారాల కన్నా పవన్ బాబు…

హమ్మయ్య. ఓ పనైపోయింది. కొడకా కొటీశ్వర్రావా- కరుసైపోతవురో-దోసైపోతవురో-చెత్తయిపోతవురో – మట్టయిపోతవురో..అంటూ తిట్ల దండకాన్ని పాటగా మార్చి పవన్ చేత పాడించిన పాట బయటకు వదిలేసారు. పాట, ట్యూన్ ఇంతరత్రా వ్యవహారాల కన్నా పవన్ బాబు హావభావాలు, త్రివిక్రమ్ సారు రెస్పాన్స్, నూట ఇరవై కోట్లు పెట్టేసిన నిర్మాత చినబాబు తన్మయత్వం పాట విడియోలో బాగా కనిపించాయి.

గతంలో అనిరుధ్ చేసిన క్యాచీ మాస్ ట్యూన్స్ తో పోల్చుకుంటే ఇదేమీ గొప్పగా కానీ, కొత్తగా కానీ లేదు. ఇది చేదు నిజం. సాహిత్యం మొత్తం త్రివిక్రమ్ ప్రాస డైలాగుల మాదిరిగా తిట్లతో సాగింది తప్ప వేరేం లేదు. పాటకు మిక్స్ చేసిన విడియోలో కనిపిస్తున్నదానిని బట్టి రఘుబాబు నే కోటీశ్వర్రావేమో అనుకోవాలి. 

ఆ సంగతి అలా వుంచితే శర్మగారూ…శర్మగారూ అంటూ పవన్ ఒకటి కి రెండు సార్లు పలకడం, తన గాన ప్రతిభను అందుకునే రేంజ్ యువ సంగీత దర్శకులు ఎవరూ లేరా అని అడగడం చూస్తే, అసలు ఈ శర్మ అనే కనిపించని క్యారెక్టర్ ఎవరా అన్న అనుమానం కలుగుతుంది. పాట రాసింది భాస్కర భట్ల. ముందుగా శర్మగారు అని పిలవడం, ఆ తరువాత సరైన సంగీత దర్శకులు లేరా అనడం బట్టి చూస్తుంటే, కొంపదీసి సంగీత దర్శకుడు మణిశర్మను ఏమన్నా గుర్తు చేసుకున్నారా? అన్న చిన్న అనుమానం కలుగుతుంది. 

కానీ విషయం అది కాదట. సినిమాలో రావు రమేష్ వర్మ అంట, మురళీ శర్మ, శర్మ అంట. అదీ విషయం.

అంతా బాగుంది. మంచి మేధావి, టాలీవుడ్ టాప్ త్రీ డైరక్టర్లలో ఒకడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వెళ్లి వెళ్లి పవన్ కాళ్ల దగ్గర కూర్చున్నట్లు విడియోలో చూపించడం ఏమిటో? ఎంత సరదాకు, విడియోకు అయినా, మేధావి, రచయిత, దర్శకుడు అయిన త్రివిక్రమ్ పోయి పోయి, జస్ట్ ఓ హీరో అయిన పవన్ కాళ్ల దగ్గర కూర్చోవడం ఏమిటో? పవన్ నే అంటారుగా. నూక్లియర్ ఫిజిక్స్ చదివిన మేధావి, గొప్పవాడు అని. అలాంటి వాడిని తన కాళ్ల దగ్గర కూర్చుంటే చూస్తూ ఊరుకోవడం ఏమిటో?

దాసరి లాంటి దర్శకుడు సెట్ లోకి వస్తుంటే ఎన్టీఆర్, ఎఎన్నార్ లేచి నిల్చున్న రోజులు వున్నాయి. అంతే కానీ వాళ్ల కాళ్ల దగ్గర దాసరి ఏనాడూ కూర్చోలేదు. ఏం చేస్తాం, రోజులు మారాయి.