సినిమా రివ్యూ: సప్తగిరి ఎల్‌ఎల్‌బి

రివ్యూ: సప్తగిరి ఎల్‌ఎల్‌బి రేటింగ్‌: 2/5 బ్యానర్‌: సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. తారాగణం: సప్తగిరి, సాయికుమార్‌, శివ ప్రసాద్‌, ఖషిష్‌ వోరా, గొల్లపూడి మారుతిరావు, కోట శ్రీనివాసరావు, షకలక శంకర్‌, రఘుబాబు,…

రివ్యూ: సప్తగిరి ఎల్‌ఎల్‌బి
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి.
తారాగణం: సప్తగిరి, సాయికుమార్‌, శివ ప్రసాద్‌, ఖషిష్‌ వోరా, గొల్లపూడి మారుతిరావు, కోట శ్రీనివాసరావు, షకలక శంకర్‌, రఘుబాబు, ఝాన్సీ తదితరులు
కథ: సుభాష్‌ పూర్‌
మాటలు: పరుచూరి బ్రదర్స్‌
కూర్పు: గౌతంరాజు
సంగీతం: బుల్గానిన్‌
ఛాయాగ్రహణం: ఎస్‌.ఆర్‌. సారంగం
నిర్మాత: డా. రవికిరణ్‌
దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల
విడుదల తేదీ: డిసెంబర్‌ 8, 2017

హీరో వేషం వేయగానే తమ నుంచి ప్రేక్షకులు కామెడీ కాకుండా డాన్సులు, ఫైట్లు ఆశిస్తారనే ఆలోచన మన కమెడియన్లకి ఎందుకు వస్తుందో ఏమో కానీ… ఒక్కసారి హీరో క్యారెక్టర్‌ ఇవ్వగానే తమకొచ్చింది, తమలో జనాలకి నచ్చింది వదిలేసి, తమలోని ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్స్‌, బోనస్‌ టాలెంట్స్‌ ఏమిటో చూపించే పనిలో బిజీ అవుతారు. సునీల్‌ తర్వాత అదే పంథాలో సప్తగిరి కూడా సాగుతున్నాడు. హీరోగా మొదటి సినిమాలోనే చాలా 'టాలెంట్‌' చూపించిన సప్తగిరి ఇప్పుడు ఇంకోసారి తనలోని 'హీరో'ని చూడండంటూ మన ముందుకొచ్చాడు.

తను ఎంచుకున్న కథకి ఈ డాన్సులు, ఫైట్లు సెట్‌ అవుతాయా లేదా అనేది కూడా చూడకుండా, హీరో కాబట్టి అవన్నీ చేసి తీరాల్సిందే అన్నట్టు 'జాలీ ఎల్‌ఎల్‌బి' అనే మంచి చిత్రాన్ని కిచిడీ చేసేసాడు. పాటలు, ఫైట్లని కథ డిమాండ్‌ చేయడం వేరు… మన డిమాండ్లకి తగ్గట్టు కథని పక్కదోవ పట్టించడం వేరు. సప్తగిరి ఎల్‌ఎల్‌బిలో ఒక మంచి కథ అలాగే పక్క దారులు పట్టి సహనాన్ని పరీక్షించే గందరగోళంగా తయారైంది. దీనికి సప్తగిరి సగం బాధ్యుడు కాగా, ఒరిజినల్‌ కథలోని సోల్‌ని స్టడీ చేసి, అందుకు తగ్గ పునఃసృష్టి చేయలేకపోయిన దర్శకుడిదే మిగతా బాధ్యత.

న్యాయ వ్యవస్థ పేద, ధనిక వర్గాల తారతమ్యాలతో ఏ రీతిన అన్యాయం చేస్తుందనే థీమ్‌ని తీసుకుని ఒక సోషల్‌ సెటైర్‌లా తీర్చిదిద్దిన ఒరిజినల్‌ సినిమాలో అటు వినోదం, ఇటు ఎమోషన్‌ రెండూ సమపాళ్లలో వుంటాయి. అన్నిటికీ మించి రక్తమాంసాలున్న పాత్రలు తెరపై సజీవంగా కనిపిస్తూ దర్శకుడి ఆలోచనలకి ప్రాణం పోసాయి. ఈ తరహా చిత్రాలని రీమేక్‌ చేయడం అంత తేలిక కాదు. ఆ సోల్‌ని అలాగే వుంచి, తిరిగి ఆ ఫీల్‌ పుట్టించడం అనుభవజ్ఞులతో తప్ప సాధ్యపడదు.

జాలీ ఎల్‌ఎల్‌బి చిత్రానికి ప్రధానాకర్షణ జడ్జిగా సౌరభ్‌ శుక్లా, క్రిమినల్‌ లాయర్‌ పాత్రలో బొమన్‌ ఇరానీ. జడ్జి పాత్రని అద్భుతంగా పోషించిన సౌరభ్‌కి జాతీయ పురస్కారం కూడా లభించింది. ఆ పాత్రని ఇక్కడ శివ ప్రసాద్‌ పోషించారు. తన శాయశక్తులా ఈ పాత్రని రక్తి కట్టించడానికి శ్రమించినా కానీ సౌరభ్‌ మ్యాజిక్‌ తిరిగి చేయడం సాధ్యమవలేదు. ఇక క్రిమినల్‌ లాయర్‌ పాత్రలో సాయికుమార్‌ మెప్పించినా బొమన్‌ ఇరానీ మాదిరిగా ఆ పాత్రకి సహజత్వాన్ని తీసుకురాలేకపోయాడు. అయినప్పటికీ సప్తగిరి ఎల్‌ఎల్‌బికి సంబంధించి వీరిద్దరే సిన్సియర్‌గా ఎఫర్ట్స్‌ పెట్టారు. తెర వెనుక కానీ, తెరపై కానీ మిగిలిన ఏ ఒక్కరూ ఒరిజినల్‌ని మ్యాచ్‌ చేయాలనే తపన సయితం చూపించలేదు.

కామెడీ కోసమని జోడించిన సన్నివేశాలన్నీ పేలవంగా తయారవడమే కాకుండా, ఇంకా ఇలాంటివాటికి ప్రేక్షకులు నవ్వుతారని ఆశించిన వారి సెన్సాఫ్‌ హ్యూమర్‌ లెవల్స్‌ మీద డౌట్స్‌ రేకెత్తుతాయి. రైతుల సమస్యల గురించి మాట్లాడితే ఎమోషనల్‌గా వర్కవుట్‌ అవుతుందనే ప్రయత్నమొకటి జరిగింది కానీ అలాంటి పెద్ద అంశాల గురించి మాట్లాడేందుకు చిరంజీవి అంత స్టేచర్‌ వున్న నటులు తెరపై వుండాలి. జాలీ ఎల్‌ఎల్‌బిలో ఎలాంటి హీరోయిజం లేకుండా చాలా సింపుల్‌గా వుండే అర్షద్‌ వార్సీ పాత్ర రీమేక్‌లోకి వచ్చేసరికి ఎందుకని అంత అవసరం లేని హీరోయిజం చూపించాల్సి వచ్చిందో, ఎందుకోసం నేల విడిచి సాము చేయాల్సి వచ్చిందో సప్తగిరే చెప్పాలి.

ఒరిజినల్‌కి ఎలాంటి టింకరింగులు చేయకుండా సిన్సియర్‌ ఎఫర్ట్స్‌ పెట్టినట్టయితే ఈ చిత్రం సప్తగిరికి నటుడిగా కొత్త ఇమేజ్‌ ఇచ్చి వుండేది. ఇతర అంశాలపై ధ్యాస వలనో ఏమో ప్రస్తుతం అతని కామెడీ కూడా అలరించలేకపోతోంది. కమెడియన్‌ హీరోగా నటించిన సినిమాలో హాయిగా నవ్వుకోతగ్గ ఒక్క జోక్‌ లేకపోవడం బాధాకరం. ఆ గాడీగా కనిపించే బట్టలు, ఆ బలవంతపు చిందులు కంటే కాసిని నవ్వులయినా వుండుంటే సమయం వెచ్చించి వచ్చిన వాళ్లకి ఎంతోకొంత గిట్టుబాటు అయి వుండేది.

ప్రథమార్ధం విపరీతంగా విసిగించగా, ద్వితియార్ధం కూడా అదే రీతిన మొదలైనప్పటికీ చివరకు వచ్చేసరికి కుదురుకుంది. కథ బలమైనది కావడం వల్ల ఎంత కంగాళీ చేసినా కానీ ఒక్కో సందర్భంలో దాని ఉనికి నిలుపుకుంది. చివరి కోర్టు రూమ్‌ సన్నివేశం మెచ్చుకోతగ్గట్టుగా తెరకెక్కింది. వీలయినంతగా ఒరిజినల్‌కి కట్టుబడి వుండడం వల్ల ఈ సన్నివేశం మెప్పించింది.

మరి మిగతా సినిమా విషయంలో ఎందుకని సొంత తెలివి ఉపయోగించాల్సి వచ్చిందో, ఏ కారణం మీద అవసరం లేని అలంకరణలతో కళ తప్పిందో చిత్ర బృందమే విశ్లేషించుకోవాలి. మాస్‌ని మెప్పించడం కోసం ఇవన్నీ చేసామనే ఎస్కేపిస్ట్‌ థియరీ చెప్పవచ్చు కానీ మాస్‌ ప్రేక్షకుల అభిరుచులూ మారుతున్నాయి మరి. వారిని సాకుగా చూపించి సొంత సరదాలతో అసలు కథలకి ఎసరు పెట్టుకోకుంటే మంచిది. రెండు గంటల పాటు నడిపించే కథ లేక సినిమాలు ఇక్కట్ల పాలవుతుంటాయి. ఇక్కడ ఒక మంచి కథ వున్నప్పటికీ, దానిని ఎలా నడిపించాలనేది ఎదురుగా సినిమా రూపంలోనే కనిపిస్తున్నప్పటికీ దానిని పక్క దారులు పట్టించడమే నిరాశ కలిగిస్తుంది. 

బాటమ్‌ లైన్‌: ట్రాక్‌ తప్పిన రీమేక్‌!

– గణేష్‌ రావూరి