మొత్తానికి లెజెండ్ సినిమాలోని సందేశాన్ని సామాన్య జనానికి వినిపించేందుకు తెగ తంటాలు పడుతున్నారు నంది అవార్డ్స్ జ్యూరి సభ్యులు! వీళ్ల తాపత్రయం చూస్తుంటే.. వీళ్లు అవార్డ్స్ ప్రకటించిన తీరు ఎంత కంగాళీగా ఉందో అందరికీ అర్థమయ్యేలా చేస్తోంది. విమర్శలు వస్తున్నాయి.. వాటికి సమాధానం ఇవ్వాలని వీరు తపనపడుతున్న తీరు.. అవార్డ్స్ కు అర్హులను ఎంపిక చేసిన వైనంలో డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తోంది.
లెజెండ్ సినిమాకు తొమ్మిది అవార్డులు ఇవ్వడాన్ని సమర్థించుకొంటూ జ్యూరీ సభ్యుడు ఒకరు ఇప్పటికే చేసిన ఒక ప్రకటన ప్రహసనంగా నిలుస్తోంది. లెజెండ్ సినిమాలో బ్రుణ హత్యలను వ్యతిరేకిస్తూ సందేశం ఉందని ప్రకటించారు.. ఇప్పుడు మరో కబురేమిటంటే.. ఈ సినిమాలో రాజకీయాలకు సంబంధించిన సందేశమూ ఉందట. అదేమిటంటే.. ‘రాజకీయాల్లో అమ్ముడుపోతున్న ఎమ్మెల్యేల గురించి ఈ సినిమాలో చర్చించారు..ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ అవార్డులను ప్రకటించాం..’ అని నంది అవార్డ్స్ జ్యూరీ సభ్యుడు ప్రసన్న చెప్పుకొచ్చారు.
భలే ఉంది కదా.. రాజకీయాల్లో అమ్ముడవుతున్న ఎమ్మెల్యేల గురించి చర్చించారట. ఇది ఎవరికి ఎక్కడ తగలాలో అక్కడే తగులుతోంది. అవతల బావయ్య.. ఎమ్మెల్యేలను కొంటున్నాడు, ఇవతల బాలయ్య వాళ్లకు సందేశాన్ని ఇస్తున్నాడు. మరి ఇంకేముంది.. ఫిరాయింపు ఎమ్మెల్యేలందరికీ లెజెండ్ సినిమాను చూపిస్తే సరిపోతుందేమో. వారిలో పరివర్తన రాదా ఈ నందీ అవార్డు స్థాయి సినిమాను చూపిస్తే. అలాగే బాబు గారికి కూడా ఒక షో వేసి బాలయ్య సినిమాను చూపిస్తే.. ప్రతిపక్ష పార్టీ కూడా ఆనందించదా!