సుకుమార్ కూడా ఇలాగనా?

ఓ పెద్ద సినిమా డైరక్ట్ చేస్తూ, విడుదల దగ్గర పడ్డాక, తరువాతి సినిమాపై ఇండస్ట్రీలోకి ఫీలర్లు పంపించడం అన్నది ఇటీవల కామన్ అయిపోయింది. డిజె సినిమా విడుదల టైమ్ లో హరీష్ శంకర్ పేరు…

ఓ పెద్ద సినిమా డైరక్ట్ చేస్తూ, విడుదల దగ్గర పడ్డాక, తరువాతి సినిమాపై ఇండస్ట్రీలోకి ఫీలర్లు పంపించడం అన్నది ఇటీవల కామన్ అయిపోయింది. డిజె సినిమా విడుదల టైమ్ లో హరీష్ శంకర్ పేరు ఇలాగే తెగ వినిపించింది. అదిగో ఎన్టీఆర్, ఇదిగో పవన్, కాదు, కాదు, మహేష్ బాబు అంటూ. ఆఖరికి ఇప్పటికి ఏ సినిమా లేదు. శర్వానంద్, నాని కూడా నో అని చెప్పేసారని ఇండస్ట్రీ టాక్. ఆఖరికి కొత్తవాళ్లతో చేసుకోవాల్సిన పరిస్థితి.

ఇక జైలవకుశ ముందు డైరక్టర్ బాబీ విషయంలో కూడా ఇదే హడావుడి. బన్నీకి కథ చెప్పాడు, మహేష్ కు కూడా చెప్పేసినట్లే అంటూ. కానీ ఇప్పటి దాకా మరే ప్రాజెక్టు పట్టాల మీదకు రాలేదు. బన్నీ ఆలోచిస్తా అనేసాడని తెలుస్తోంది. నాని మాత్రం భరోసా ఇచ్చాడు. ఆ సినిమా పట్టాలు ఎక్కాలి? ఎప్పటికో? ఏమో?

ఇప్పుడు సుకుమార్ టైమ్ వచ్చినట్లు కనిపిస్తోంది. రంగస్థలం విడుదల మార్చిలో వుంటుంది. ఇప్పటి నుంచీ తరువాతి సినిమా మీద కథలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ ఖాళీ లేడు, బన్నీ లైన్ వేరు. పవన్ వ్యవహారం అగమ్యగోచరం. మరి ఇంక ఎవరు మిగిలారు. మహేష్ బాబే. అందుకే మహేష్ కు లైన్ చెప్పేసాడు, సూపర్ అన్నాడు అంటూ ఫీలర్లు బయటకు వచ్చాయి. నిర్మాతను కూడా రెడీ చేసేసారు. 14 రీల్స్ సంస్థ.

పాపం ఆ సంస్థ వరుస ఫ్లాపులతో భయంకరమైన పరిస్థితిలో వుంది. అసలే సుకుమార్-మహేష్ తో ఓ సినిమా చేసి తట్టుకోలేని దెబ్బ తింది. అందుకే ఈసారి మహేష్ సినిమాకు బోయపాటిని సెట్ చేయాలని తెగ డిస్కషన్లు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో సుకుమార్ ప్రాజెక్ట్ నే మళ్లీ ఆ సంస్థకు అంటగడుతున్నారు గ్యాసిప్ ల్లో. 

మహేష్ కూడా నిజానికి ఖాళీ లేడు. కొరటాల శివ, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి ఇలా వుంది లైనప్. ఇందులో మధ్యలో ఎక్కడ దూరడానికి అవుతుందో సుకుమార్ కు. లేదా గ్యాసిప్ మాత్రమేనా అన్నది మార్చి తరువాత తెలిసిపోతుంది.