ఒకప్పుడు కథకుడే దర్శకుడు కావాలని కానీ, దర్శకుడే కథకుడు కావాలని కానీ వుండేదికాదు. ఎన్నో సినిమాలు డైరక్ట్ చేసిన రాఘవేంద్రరావు ఏనాడు కథ రాయలేదు. అదే మాదిరిగా తన సినిమాలకు చాలా వరకు కథలు అందించిన విశ్వనాధ్ మాటల రచన జోలికి మాత్రంపోలేదు. హిట్ చిత్రాల రచయితలుగా పేరొందిన పరుచూరి బ్రదర్స్ ఒక్కసారి మాత్రమే దర్శకత్వం ట్రయ్ చేసారు. అయితే ఇటీవల మూడు నాలుగేళ్లుగా ట్రెండ్ మారింది. ఎవరి దగ్గర మాంచి కాన్సెప్ట్ వుంటే, కథ మాటలు అల్లగలిగితే వాళ్లే దర్శకులు.
సినిమా జనాలకు సరైన కథలు కరువు కావడంతో, అప్పటికి వున్న దర్శకులకు కథలు అల్లుకునే స్టామినా లేకపోవడంతో, రచయితలను దర్శకులుగా మార్చడం ప్రారంభమైంది. త్రివిక్రమ్, కొరటాల, మారుతి, హరీష్ శంకర్, బాబీ, సతీష్ వేగ్నిశ, వక్కంతం వంశీ ఇలా దాదాపు అందరూ రచయితలు కమ్ దర్శకులే.
అయితే ట్రెండ్ మళ్లీ మారుతుందేమో అన్న అనుమానం వస్తోంది. దర్శకులుగా మారిన రచయితలకు విజయాలు వరించడంతో బిజీ అయిపోతున్నారు. వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి. దాంతో కథలు అల్లేంత తీరుబాటు, సృజన తగ్గిపోతోంది. ఇక తప్పక వేరే కథల వైపు చూస్తున్నారు. హాలీవుడ్ సినిమాలను చూసి కథలు అల్లుకోవడమో, లేదా ఎక్కడో అక్కడ ఏదో ఒకదాన్ని పట్టుకుని అటు ఇటు మార్చుకోవడమో, కాదూ అంటే ఎవరిదగ్గర అయినా కథ తీసుకోవడమో మార్గాంతరం అవుతోంది.
శ్రీమంతుడు కథ తనదే అంటూ దర్శకుడు కొరటాల శివ మీద ఓ రైటర్ కేసు వేసారు. కొరటాల శివ లేటెస్ట్ సినిమా భరత్ అనే నేను కోసం వేరే దర్శకుడి కథను కొనుక్కున్నారు. అందుకు కోటి రూపాయలు ఇచ్చారని వినికిడి.
దర్శకుడు త్రివిక్రమ్ తన అ..ఆ సినిమా కోసం యద్దనపుడి సులోచనారాణి మీనా నవలపై ఆధారపడ్డారు. త్వరలో చేయబోయే సినిమాల కోసం ఓ డిటెక్టివ్ నవల హక్కులు తీసుకున్నారని వార్తలు వినవచ్చాయి.
చాలామంది రచయితలు దర్శకులుగా మారాక, ఓ స్థాయికి వచ్చాక సరైన కథలు అల్లుకోలేకపోతున్నారు. వారి టేకింగ్ అలాగే వుంటోంది. కానీ సరైన కథలు పడడంలేదు. సీనియర్ వంశీకి ఇదే సమస్య. శ్రీనువైట్లకు ఇదే సమస్య. జంధ్యాల లాంటి రచయిత కమ్ దర్శకుడు కూడా తన చివరి స్టేజ్ లో అరకొర కథలే అల్లగలిగారు. శంకరాభరణం, స్వాతిముత్యం లాంటి కథలు అందించిన విశ్వనాధ్ చివరి సినిమాలకు నాసిరకం కథలు సమకూర్చుకున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే రచయితలు దర్శకులుగా మారి వారి అభిరుచి, ఆశయం, లక్ష్యం నెరవేర్చుకుంటున్నారేమో కానీ, సినిమా రంగానికి సరైన కథలు మాత్రం అందించలేకపోతున్నారు.