ఇది మెగా తిట్ల కార్యక్రమం ?

టాలీవుడ్ లో అంతే. ఎవరో చేసిన పనికి మరెవరికో తిట్లు పడతాయి. ఒక్కోసారి తిట్లు వినపడవు. ఎందుకంటే ఎక్కడో నాలుగు గోడల మధ్యన ఎవరి దగ్గరో తిడతారు. అవి ఆ నోటా, ఈ నోటా…

టాలీవుడ్ లో అంతే. ఎవరో చేసిన పనికి మరెవరికో తిట్లు పడతాయి. ఒక్కోసారి తిట్లు వినపడవు. ఎందుకంటే ఎక్కడో నాలుగు గోడల మధ్యన ఎవరి దగ్గరో తిడతారు. అవి ఆ నోటా, ఈ నోటా పడి అసలైన చోటికి చేరుకోవాలి. చిత్ర విచిత్రాలు వుంటాయి చలనచిత్ర సీమలో.

ఇలాంటి ‘మెగా’ తిట్ల కార్యక్రమంలో ఒకటి తెరవెనుక నడుస్తోంది టాలీవుడ్ లో అని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవర్ని ఎవరు తిడుతున్నారు? ఎందుకు తిడుతున్నారని అంటున్నారు వగైరా చూద్దాం.

2017 దసరాకు రావాల్సిన సినిమా రంగస్థలం 1985. సుకుమార్ దర్శకుడు. రామ్ చరణ్ హీరో. కానీ దర్శకుడు సుకుమార్ చెక్కడు కారణంగా అది అలా అలా అలా వెనక్కు వెళ్లి సంక్రాంతికి ఫిక్స్ అయింది. అలా అని యూనిట్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.

ఇదిలా వుంటే, ఎప్పుడు వస్తుంది.. ఎలా వస్తుంది చెప్పకుండా ప్రారంభమైంది పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా. 2016 నవంబర్ లో ప్రారంభమై 2017 సమ్మర్ కో, లేక దసరాకో, లేక దీపావళికో వస్తుందని జనం అనుకోవడమే కానీ, పవన్ జనసేన పార్టీ పద్దతి లాగానే ఓ క్లియర్ ప్రకటన అంటూ లేకపోయింది. ఇలా అంట.. అలా అంట ఎవరి గ్యాసిప్ లు వాళ్లు రాసుకోవడమే.

అలాంటి సినిమా ఉరిమి.. ఉరిమి 2018 సంక్రాంతి మీద పడింది. అప్పటికే పాపం, రంగస్థలం 1985 సినిమా సంక్రాంతికి వస్తున్నాం అని డేట్ ప్రకటించింది క్లియర్ గా. పైగా అది ఎవరి సినిమా. పవన్ అన్నగారి అబ్బాయి సినిమా. మరి కాస్త ఆలోచించాలి కదా, డేట్ ప్రకటించేటపుడు. అలాంటివి ఏవీ జరగలేదు. దీంతో ఇప్పుడు అనివార్యంగా మార్చిలోనో, ఏప్రియల్ లోనో సెలవులు కలిసి వచ్చి, లాంగ్ వీకెండ్ దొరికే డేట్ చూసుకుంటోందని వినికిడి.

ఇక్కడే దర్శకుడు సుకుమార్ కు బోలెడు కోపం వస్తోందని వినికిడి. తన దగ్గర జనాల దగ్గరో, యూనిట్ అసిస్టెంట్ ల దగ్గరో, ఈ విషయమై తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయు. ‘ఆయన కూడా డైరక్టరే కదా, ఓ డైరక్టర్ కష్టం ఆయనకు తెలియదా? మనం ముందు డేట్ ప్రకటించాం. ఇలా వచ్చి మీద పడితే ఏం అనాలి’ అనే అర్థం వచ్చేలా సుకుమార్ తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కట్ చేస్తే, ఇక్కడ ఇంకో అంకం మొదలైంది.

అల్లు అర్జున్ – వక్కంతం వంశీ కాంబినేషన్ లో తయారవుతున్న ‘ నా పేరు సూర్య’ సినిమా. ఈ సినిమాకు పైకి ప్రకటించకున్నా, వరుస సెలవులు వుండే ఓ వీకెండ్ ను సమ్మర్ టైమ్ లో వెదికి పెట్టుకున్నట్లు వినికిడి. ఇప్పుడు రామ్ చరణ్-సుకుమార్ సినిమా వెళ్లి వెళ్లి అక్కడ సెటిల్ అవుతోందట. దాంతో బన్నీ గుర్రుమంటున్నట్లు వినికిడి. ‘మనం ముందే ఈ డేట్ ను అనుకుంటున్నాం కదా? అలాంటపుడు అలా వస్తే ఎలా’ అని ఆయన కూడా గుస్సాయిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి మూడు సినిమాలు మెగా సినిమాలే. మెగా హీరోల సినిమాలే. కానీ ఒకరితో ఒకరు కూర్చోరు. డేట్ల గురించి డిస్కషన్లు చేసుకోరు. నిర్మాతలు, డైరక్టర్లు పాట్లు పడాలి. అసహనాన్ని, ఇలా వెళ్లగక్కుకోవాలి పాపం. ఇప్పుడు మూడు సినిమాల్లొ పవన్ సినిమా సేఫ్ జోన్ లో కూర్చుంది. మిగిలిన వాళ్లు వాళ్ల పాట్లు వాళ్లు పడతారు.