తమిళనాట కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ ఇప్పటికే వివాదాస్పదమైంది. అసలు కమల్ అంటే వివాదాలు. ఇక బిగ్ బాస్ సంగతి సరేసరి. ఇలాంటి వ్యక్తి, అలాంటి షో కలిస్తే వివాదాలు రాకుండా ఉంటాయా. ఆ సంగతి పక్కనపెడితే తెలుగులో కూడా బిగ్ బాస్ కు చిక్కులు తప్పేలా లేవు.
కమల్ తో పోలిస్తే ఎన్టీఆర్ వివాదాలకు చాలా దూరం. కాబట్టి హోస్ట్ సైడ్ నుంచి కంప్లయింట్స్ ఉండకపోవచ్చు. కానీ రియాలిటీ షో కాన్సెప్ట్ మాత్రం వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉందంటూ ఓ పిటిషన్ ఫైల్ అయింది.
హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఈ మేరకు ఓ సామాజిక కార్యకర్త పిటిషన్ వేశాడు. బిగ్ బాస్ షోను నిలిపివేయాలని, కుదరని పక్షంలో కొన్ని మార్పులు చేయాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
తమిళ బిగ్ బాస్ సెట్ లో ఓ వ్యక్తి మరణించాడు. మరో హీరోయిన్ ఆత్మహత్యాయత్నం చేసింది. తెలుగు బిగ్ బాస్ లో ఇన్ని ఘోరాల్లేవు. కాకపోతే ఇక్కడి షోలో వేస్తున్న శిక్షలు, చూపిస్తున్న దృశ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు చాలామంది సోషల్ యాక్టివిస్టులు. రేపు ఈ పిటిషన్ ను పరిశీలిస్తారు.