వైసీపీ ఎంపీ టార్గెట్.. ఏకమైన ప్రత్యర్ధులు!

ఏపీలో వైసీపీని గద్దె దించడానికి టీడీపీ జనసేన ఏకం అయ్యాయి. రెండు పార్టీల మధ్య కింద స్థాయిలో ఆ కసి ఉందో లేదో ఎన్నికలలో తెలుస్తుంది. అయితే ఇందుకు భిన్నం విశాఖ తూర్పు నియోజకవర్గం.…

ఏపీలో వైసీపీని గద్దె దించడానికి టీడీపీ జనసేన ఏకం అయ్యాయి. రెండు పార్టీల మధ్య కింద స్థాయిలో ఆ కసి ఉందో లేదో ఎన్నికలలో తెలుస్తుంది. అయితే ఇందుకు భిన్నం విశాఖ తూర్పు నియోజకవర్గం. అక్కడ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను టార్గెట్ గా చేసుకుని ఇద్దరు ప్రత్యర్ధులు ఒక్కటి అయ్యారు.

ఎంపీ ఎంవీవీ విశాఖ తూర్పు నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా  పోటీ చేయబోతున్నారు. ఆయనను చాలా కాలం క్రితమే వైసీపీ అధినాయకత్వం నియోజకవర్గం ఇంచార్జిగా నియమించింది. ఆ సీటు ఆశించి భంగపడిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరారు. ఆయన ఇంటికి తాజాగా తూర్పు సిట్టింగ్ ఎమ్మెల్యే  టీడీపీ నేత వెలగపూడి రామక్రిష్ణబాబు వెళ్లారు.

ఎంపీ ఎంవీవీని ఓడించడానికి వెలగపూడిని గెలిపించడానికి తన పూర్తి సహకారం అందిస్తాను అని వంశీ హామీ ఇచ్చారు. ఇద్దరు నేతలూ మీడియాతో మాట్లాడుతూ ఎంపీ ఎంవీవీ తమ టార్గెట్ అని చెప్పేశారు. వంశీ అయితే తాను వైసీపీని వీడడానికి వైసీపీ ఎంపీనే కారణం అని మరోమారు చెప్పారు. ఆయనను ఓడించేందుకు ఎంత దాకా అయినా వెళ్తాను అని శపధం పట్టారు.

ఏపీలోనే  అత్యధిక ఓట్ల మెజారిటీతో  వెలగపూడి గెలుస్తారు అని వంశీ జోస్యం చెప్పారు.  వైసీపీ ఎంపీ  భూ కబ్జాలకు విశాఖలో అడ్డుకట్ట వేస్తామని ఆయనని ఓటమితోనే అది సాధ్యమని అన్నారు. రేపటి ఎన్నికల తరువాత ఏపీలో ఏర్పడే జనసేన టీడీపీ ప్రభుత్వంలో మొదటి చర్యలు ఎంపీ ఎంవీవీ మీదనే ఉంటాయని అన్నారు. తాను ఆయన వెంటపడతాను అని ఆయన మీద చర్యలు తీసుకునే దాకా తాను ఊరుకునేది లేదని అన్నారు.

ఇదిలా ఉంటే వంశీ- వెలగపూడి 2009లో మొదటిసారి విశాఖ తూర్పు నుంచి ప్రత్యర్ధులుగా తలపడ్డారు. ప్రజారాజ్యం నుంచి వంశీ ఆనాడు పోటీ చేస్తే టీడీపీ నుంచి వెలగపూడి పోటీ చేసి గెలిచారు. 2014లో వంశీ వైసీపీ నుంచి అదే సీటులో పోటీ పడితే రెండవమారు వెలగపూడి వంశీని ఓడించారు. 2019లో వంశీకి టికెట్ దక్కలేదు. 2024 నాటికి ఇద్దరు ప్రత్యర్ధులు మంచి మిత్రులు అయ్యారు. ఇద్దరి టార్గెట్ ఒక్కటే ఎంపీ ఎంవీవీని ఓడించడం. ఈ టార్గెట్ నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి.