టీడీపీ చినబాబు లోకేష్ శంఖారావం మీటింగులలో ఇస్తున్న స్టేట్మెంట్స్ చాలా ట్రోల్స్ అవుతున్నాయి. ఆవేశంతో ఆయన చేస్తున్న ప్రసంగాలలో విషయం వేరేగా వెళ్తోంది. క్యాచీగా ఉంటుందని ఆయన వాడుతున్న డైలాగులు కూడా వైసీపీకి అస్త్రాలుగా మారుతున్నాయి.
విజయనగరం జిల్లా సభలలో లోకేష్ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే విశాఖలో రుషికొండ మీద తన ఇంటి కోసం జగన్ కట్టిన భవనాన్ని ప్రజా భవన్ గా మారుస్తామని ఒక పవర్ ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఫ్లోలో ఈ మాటలు అన్నా దీని వెనక అర్ధాలు తీస్తున్న వైసీపీ నేతలు విశాఖ రాజధానికి లోకేష్ అలా ఓకే చెప్పారా అని ప్రశ్నిస్తున్నారు.
జగన్ విశాఖకు రావాలని ఇక్కడ నుంచి పాలించాలని క్యాంప్ ఆఫీసుగా రుషికొండ మీద ప్రభుత్వ నిధులతో భవనాలు నిర్మించారు. ఇపుడు ఆ భవనాలను ప్రజా భవన్ గా మారుస్తామంటే అక్కడ సీఎం ఉండి ప్రజా సమస్యల మీద వినతిపత్రాలు తీసుకోవాలి. నిత్యం ప్రజలను కలుస్తూ ఉండాలి.
అలా చూసుకుంటే విశాఖ రాజధాని అవుతుంది అన్న మాట. జగన్ విశాఖలో క్యాంప్ ఆఫీసు అని మాత్రమే చేసుకోవాలనుకున్నారు. లోకేష్ ప్రజాభవన్ గా టూరిజం భవనాలను వాడుకుంటే సీఎం పూర్తిగానే విశాఖలోనే ఉండాల్సి వస్తుంది. ప్రజల కోసం తలుపులు తీయాల్సి వస్తుంది.
తెలంగాణాలో ప్రగతి భవన్ ని రేవంత్ రెడ్డి ప్రజా భవన్ గా మార్చారు. అది గుర్తుంచుకుని లోకేష్ కూడా ఏపీలో జగన్ క్యాంప్ ఆఫీస్ గా కట్టుకున్నారు అని ప్రచారంలో ఉన్న భవనాలను ప్రజా భవన్ గా చేస్తామని అంటున్నారు. అక్కడ సీఎం ప్రజా భవన్ లో వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు. ప్రగతి భవన్ ప్రజాభవన్ గా పేరు మార్చినా హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్ రాజధాని. మరి విశాఖ కూడా రాజధానిగా లోకేష్ ఒప్పుకుంటున్నట్లేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఇవే శంఖారావం సభలలో లోకేష్ మరో స్టేట్మెంట్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ని రాష్ట్ర ప్రభుత్వం కొని ప్రభుత్వ రంగంలో నడిపిస్తుందని. అంటే బీజేపీ ప్రైవేటీకరణకు అమ్మకానికి లోకేష్ టీడీపీ మద్దతు ఇస్తున్నట్లేనా అంటూ సీపీఎం మండిపడుతోంది. ఆ పార్టీ నేతలు అయితే బీజేపీతో టీడీపీ పెద్దలు మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపించకుండా ఇలా మాట్లాడుతున్నారు అని ఫైర్ అవుతున్నారు.