వైకాపా సానుభూతిపరులని కొన్ని ప్రశ్నలు కలవరపరుస్తున్నాయి.
– ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టికెట్లని కేటాయించే విషయంలో ఆలోచిస్తున్నదేంటి?
– ఎందుకు కచ్చితంగా గెలుస్తారని అంచనాలున్న బలమైన సిటింగ్ అభ్యర్థులను కూడా మార్చడం జరుగుతోంది?
– ఎందుకు అక్కడక్కడా అనామకులకి టికెట్లవడం జరుగుతోంది?
ఒకరి స్థానంలో మరొకరిని ప్రత్యామ్నాయంగా పెట్టినప్పుడు అతనికి కనీసం ప్రజల్లో మొహం చెల్లాలి కదా! అప్పటికి వరకు తలలో నాలుకలా ఉన్న నాయకులకి కాక కొత్త వ్యక్తికి ఓట్లు వేస్తారా జనం?
ఒకవేళ అభ్యర్థి మొహం చూసి కాదు తన ఇమేజుని చూసి మాత్రమే ప్రజలు ఓట్లేస్తారని జగన్ మోహన్ రెడ్డి అనుకుంటున్నారా?
అలాంటప్పుడు మార్చడం దేనికి?
ఒకరికి ఊహించని సంతోషాన్ని కలగచేయడానికి ఊహించుకుంటున్న వాడిని మనస్తాపానికి గురి చేయడం దేనికి?
దీనికి తోడు సరిగ్గా ఎన్నికల వేళ రెబెల్స్ ని పెంచి పోషించుకోవడం దేనికి?
ఇవన్నీ సమాధానం అర్ధమయ్యీ అవ్వనట్టుగా ఉన్న శేషప్రశ్నలే.
నర్సారావుపేటలో లావు కృష్ణదేవయరాయలు, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, కందుకూరులో మానుగుంట మహీందర్ రెడ్డి, ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి..వీళ్లంతా టికెట్లు దక్కక భంగపడ్డ ఉద్దండ నాయకులు.
వీళ్ల స్థానంలో వీరికంటే బలమైన అభ్యర్థుల్ని నిలబెడుతున్నారా అంటే కాదు.
వీళ్లవల్ల గెలుపు మీద అనుమునాం ఉందా అంటే అదీ కాదు!
మరి ఏం నిరూపిద్దామని ఈ మార్పులు?
అప్పట్లో ఎన్.టి.ఆర్..”నా కాలి చెప్పుని నిలబెట్టినా గెలిచి తీరుతుంది”..అని అన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి కూడా తన ఇమేజుని నిరూపించుకోవాలనుకుంటున్నారా?
ఇదే నిజమైతే ఇదంతా మంచికా చెడుకా?
..అనేది ఎన్నికల ఫలితాలొస్తే తప్ప తెలీదు.
ఎన్నికల రణరంగంలో ఎక్కడా అతినమ్మకంతో తప్పటడుగులు వేయకూడదు.
ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసినా పర్వాలేదు..కానీ ఆదమరపు, పొరపాటు పనికిరాదు.
రాజకీయాల్లో హత్యలకంటే ఆత్మహత్యలే ఉంటాయంటారు.
తప్పులు చేసి దెబ్బతింటే ప్రత్యర్థికి కలిసొచ్చేలా చేసినట్టే.
ఎప్పటి నుంచో జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం కేవలం గెలుపు కాదు. 175/175 స్కోర్ అంటూ ఆకాశానికి నిచ్చెనలు వేసారు. అంత కాకున్నా ప్రస్తుత 151 కి ఒక్క సీటు ఎక్కువ గెలిచినా చాలు 175/175 వచ్చినంత గొప్పగా చెప్పుకోవచ్చు.
కానీ ఇన్నేసి అర్ధంకాని మార్పులతో ఆ సంఖ్య సాధ్యమా అనిపిస్తోంది.
చూస్తుంటే బీసీలకి ప్రాతినిధ్యం కల్పించాలనే ఊపులో సిట్టింగులైన అగ్రకులాలవారిని తప్పిస్తున్నట్టుగా ఉంది. అయితే, ఎక్కడ వాడే మంత్రాన్ని అక్కడ వాడాలి. ఎన్నికల వేళ సరిగ్గా టికెట్లు కేటాయించే సమయంలో బీసీ మంత్రం వాడడం బెడిసికొడుతుందేమో అని అనుమానం చాలామందిలో ఉంది.
అలాగని బీసీలకి జగన్ మోహన్ రెడ్డి ఏమీ చేయడంలేదనా ఇప్పుడీ బుజ్జగింపుకి అంటే అలాంటిదేం లేదు!
వైకాపాలో బీసీలంతా గుర్రుగా ఉన్నారా అంటే అదీ కాదు.
బీసీలకి ఎంత చేస్తే అంత కృతజ్ఞత చూపిస్తారని ఆయనేమైనా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారా అంటే అది అంతకన్నా కాదు.
ఎందుకంటే బీసీ సంఘ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తికి ఇవ్వదగ్గ గౌరవం ఎంతో ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా నెగ్గాడు. ఆయన కుటుంబ సభ్యులకి గౌరవనీయమైన పోస్టులివ్వడం కూడా జరిగింది.
కానీ ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని అలిగి ఎదురుతిరుగుతున్నాడు. పార్టీ మారిపోయే ఊపులో ఉన్నాడు.
ఇవన్నీ చెబుతూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైకాపా నాయకుడు, “నందిగామ సురేష్ కి ఇచ్చే గౌరవంలో కనీసం సగం కూడా తమకి జగన్ మోహన్ రెడ్డి ఇవ్వడం లేదు. బయటేమో రెడ్లకి ఆయనేదో ప్రత్యేకంగా చేసేస్తున్నాడని అనుకుంటున్నారు. నిజానికి ప్రస్తుతం మేము సెకండ్ గ్రేడ్ సిటిజెన్స్ మాదిరి ఫీలౌతున్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు తర్వాతే మేము”, అని నీరసంగా చెప్పాడు.
ఏ నిర్ణయమైనా మంచిదా, చెడ్డదా…జెండా నిలబెట్టేదా లేక కొంప ముంచేదా అనేది ఫలితాన్ని బట్టే తెలుస్తుంది తప్ప ముందుగా చెప్పడం కష్టం.
ఒకవేళ ఇలాంటి నిర్ణయాలతో వైకాపాకి ఊహించని విజయం వస్తే మాత్రం ఇక జగన్ మోహన్ రెడ్డిని జగన్నాటకసూత్రధారి అని, అసమాన ప్రతిభావంతుడని జయహో నినాదాలు చేయొచ్చు.
తేడా వస్తే మాత్రం అవే నిర్ణయాలని చూపి తెలిసి తెలిసి తప్పు చేసాడని భారంగా నిట్టూర్చవచ్చు.
ఏం జరగనుందో కాలమే చెప్పాలి.
శ్రీనివాసమూర్తి