బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆయన భార్య జయబచ్చన్ ల ఆస్తుల విలువ 1,578 కోట్ల రూపాయలట! రాజ్యసభ సభ్యత్వం కోసం జయ నామినేషన్ నేపథ్యంలో ఈ ఆస్తుల అఫిడవిట్ ను ఆమ జత పరిచారు. ఇందులో మెజారిటీ ఆస్తులు అమితాబ్ బచ్చన్ పేరిట ఉండటం గమనార్హం.
జయ పేరిట బ్యాంకుల్లో 10 కోట్ల రూపాయల నగదు ఉండగా, అమితాబ్ పేరిట ఏకంగా 120 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండటం గమనార్హం! మొత్తం కలిపి వీరి చరాస్తులు 849 కోట్లు, స్థిరాస్తులు 729 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా జయ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
2020లో ఆమె దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్ లో మొత్తం విలువ వెయ్యి కోట్ల రూపాయలు, ఇప్పుడు ఏకంగా 578 కోట్ల రూపాయలు పెరగడం గమనార్హం. ఈ వయసులో కూడా అమితాబ్ కు చేతినిండా సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బి ప్రతి ఏటా వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టుగా ఈ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ దంపతుల ఆస్తుల్లో ఏకంగా 17 కార్లున్నాయట! వాటి విలువ 18 కోట్ల రూపాయల వరకూ ఉందట! అంటే సగటున ఒక్కోటి కోటి రూపాయలు విలువ చేసే కార్లే 17 ఉన్నట్టున్నాయి!
దాదాపు పాతికేళ్ల కిందట అమితాబ్ బచ్చన్ దివాళా దశలో ఉన్నారనే వార్తలు వచ్చాయి! ఏబీసీఎల్ కార్పొరేషన్ తో అమితాబ్ ఐపీ పెట్టారనే వార్తలు వచ్చేవి. ఆ తర్వాత కౌన్ బనేగా కరోర్ పతితో బచ్చన్ దశ తిరిగింది. ఆ షో సూపర్ హిట్ కావడంతో అమితాబ్ టైమ్ మళ్లీ మొదలైంది. మల్టీస్టారర్ గా బడేమియా చోటేమియా, సోలో హీరోగా సూర్యవంశ్, వంటి డిజాస్టర్ల తర్వాత హీరోగా కూడా అమితాబ్ కెరీర్ డైలమాలో పడింది. యాడ్స్ కొంత వరకూ ఆయనను రక్షించాయి.
భారీగా అప్పులు తేలాయనే వార్తలూ వచ్చాయి. ఆఖరికి గజ్జి తామర క్రీముల యాడ్స్ లో కూడా నటించారు. తమ అభిమాన యాంగ్రీ ఎంగ్ మ్యాన్ అలాంటి యాడ్స్ లో కనిపించడం వీరాభిమానులను నిశ్చేష్టులను చేసింది. అయితే కేబీసీ సూపర్ హిట్ కావడం, కొన్నాళ్లకు సర్కార్ తో సినిమా కెరీర్ కూడా ఊపందుకోవడంతో బచ్చన్ కు మళ్లీ తిరుగులేకుండా పోయింది. ఆ దశలో కూడా కొన్ని ఫ్లాప్ లు ఎదురైనా.. తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే లేకుండా పోయింది.