రాష్ట్ర‌మంతా బాబు ప‌ల్ల‌కీ మోస్తూ.. ఆగ్ర‌హించిన‌ ఆర్కే ప‌త్రిక‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వామ‌ప‌క్షాల బ‌లం ఎంతో అంద‌రికీ తెలుసు. నెగెటివిటీని సృష్టించేందుకు సీపీఐ, సీపీఎం పార్టీలు ప‌నికొస్తాయి. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే పార్టీలుగా వామ‌ప‌క్షాల‌కు గుర్తింపు, గౌర‌వం వుంది. అయితే ఇటీవ‌ల కాలంలో మ‌రీ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వామ‌ప‌క్షాల బ‌లం ఎంతో అంద‌రికీ తెలుసు. నెగెటివిటీని సృష్టించేందుకు సీపీఐ, సీపీఎం పార్టీలు ప‌నికొస్తాయి. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే పార్టీలుగా వామ‌ప‌క్షాల‌కు గుర్తింపు, గౌర‌వం వుంది. అయితే ఇటీవ‌ల కాలంలో మ‌రీ ముఖ్యంగా సీపీఐ వైఖ‌రి పెట్టుబ‌డీదారులు, బూర్జువా పార్టీల‌కు కొమ్ము కాసేలా వుంది. సీపీఐ నాయ‌కులు కె.నారాయ‌ణ‌, కె.రామ‌కృష్ణ సిద్ధాంతాల‌కు తిలోద‌కాలు ఇచ్చి, చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోసే ప‌నిలో బిజీ అయ్యారు.

ఈ ఇద్ద‌రు క‌మ్యూనిస్టు నాయ‌కులు చంద్ర‌బాబు సేవ‌లో ఎంత‌గా త‌ల‌మున‌కల‌య్యారంటే.. సీపీఐతో సంబంధం లేకుండా రానున్న ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని సీపీఎం ప్ర‌క‌టించేంత‌గా. వామ‌ప‌క్ష పార్టీలుగా చెప్పుకోవ‌డ‌మే త‌ప్ప‌, సీపీఐ, సీపీఎం క‌లిసి ఎన్నిక‌ల్లో ప‌ని చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. సీపీఎం మాత్రం అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీలు బీజేపీ అనుకూల వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించ‌డాన్ని త‌ప్పు ప‌డుతోంది. రెండు పార్టీల‌కు సీపీఎం దూరంగా వుంటోంది.

ఈ నేప‌థ్యంలో  'వామ పక్షం… తిరుపతిలో మాత్రం అధికారపక్షం' శీర్షిక‌తో టీడీపీ అనుకూల ప‌త్రిక‌లో జిల్లా సంచిక‌లో క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. ఈ క‌థ‌నంపై తిరుప‌తి జిల్లా సీపీఐ, సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ సుదీర్ఘ లేఖ‌ను స‌ద‌రు ప‌త్రిక బాధ్యుడికి రాశారు. ఈ క‌థ‌నం ఉద్దేశాన్ని సులువుగా అర్థం చేసుకోవ‌చ్చు. మీడియాగా తాము మోసే టీడీపీని మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మోస్తూ, తిరుప‌తిలో మాత్రం ఆ ప‌ని ఎందుకు చేయ‌లేద‌నే అర్థం ధ్వ‌నించేలా క‌థ‌నం సాగింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

స‌ద‌రు టీడీపీ అనుకూల ప‌త్రిక‌కు వామ‌ప‌క్షాల నేత‌లు “ఎర్ర జెండాకు మరకలు అంటించ లేరు” అంటూ రాసిన లేఖ‌లో త‌మ అభ్యంతరాల్ని వెల్ల‌డించిన వైనాన్ని తెలుసుకుందాం.

'వామపక్షం … తిరుపతిలో మాత్రం అధికార పక్షం' పేరుతో ప్రచురించిన వార్త మాపై కంటగింపుతో – కడుపు మంటతో రాసిందనిపిస్తోంది. మాపై రాసిన వార్త అసమంజసం గాను, పూర్తి బాధ్యతా రాహిత్యంతో కూడుకున్నదిగా భావిస్తున్నాం.

బహుశా మీ అజెండాకు అనుగుణంగా మేము నడవక పోవటమే మీ బాధకు కారణంగా  భావిస్తున్నాం.

తిరుపతి అభివృద్ధికి టీటీడీ ఒక్క శాతం నిధులు విడుదల చేయడాన్ని మేము బలపరచడం మీకు నచ్చలేదు.

తిరుపతి నగరంలో పారిశుద్ధ్య పనులను టీటీడీ చేపట్టడాన్ని మేము బలపరిచాం. అది కూడా మీకు నచ్చలేదు.

గత 30 ఏళ్లుగా టీటీడీ నిధులను ప్రజా అవసరాలకు… ముఖ్యంగా విద్య, వైద్యం, పారిశుధ్యం లాంటి పనుల నిర్వహణకు ఖర్చు చేయాలని, తిరుపతి నగర ప్రజల ప్రయోజనాలు కాపాడే విధంగా ఖర్చు కావాలనేది మా విధానం.

ఇది వైసీపీ పుట్టక ముందు నుంచి మా పార్టీలకు ఉన్న వైఖరి.

తిరుపతి నగరంలో ప్రతిపక్షాలపై పెట్టిన పోలీసు కేసులు లెక్క తీసి చూస్తే అధికంగా నిర్బంధానికి గురైంది వామపక్షాలే.

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు మాపై చేసిన దౌర్జన్యాలను, అక్రమాలను… నేరుగా వీధుల్లో ఎదుర్కొని పోరాడాం.

మంచిని మంచిగా చెప్పడం మేము చేస్తున్న తప్పా?

టిటిడి బోర్డు చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి కార్మికుల వేతనాలు పెంచినప్పుడు హర్షం వెలిబుచ్చాం. ఇది తప్పనుకోవ‌డం లేదు.

టిటిడి బోర్డు తిరుపతి నగరాభివృద్ధికి నిధులు కేటాయించడాన్ని మేము హర్షించాం! ఇది తప్పుగా మేము భావించడం లేదు.

పారిశుద్ధ్య పనులను టిటిడి బాధ్యత తీసుకోవాలని మా పార్టీ విధానం. ఆ నిర్ణయం టిటిడి చేస్తే మేము బలపరిచాం. ఇది తప్పుగా  భావించడం లేదు.

నిన్న ఒకరోజు పత్రికా ప్రకటన చేయనంత మాత్రాన… మేము అధికార పక్షానికి వత్తాసుగా మారిపోయిన మనుషుల్లా మీకు కనబడడం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.

ప్రజల ప్రయోజనాలు, వర్గ ప్రయోజనాలను విస్మరించి, బూర్జువా పార్టీల వైరుధ్యాలని, వాళ్లలో వాళ్లు తన్నుకోవడాన్ని ఆధారంగా చేసుకుని ఎవరో ఒకరి పక్షాన నిలబడి… గొంతెత్తి నినదిస్తే మీకు ఆనందం కలిగించేట్టుగా ఉంది. అది మా వైఖరి కాదు.

టీడీపీ అనుకూల ప‌త్రిక క‌థ‌నాన్ని త‌ప్పు ప‌ట్ట‌లేం. ఎందుకంటే రాష్ట్ర‌స్థాయిలో టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం సీపీఐ సంపూర్ణంగా, సీపీఎం స్వ‌ల్పంగా ప‌ని చేస్తున్నాయ‌న్న‌ది వాస్త‌వం. రాష్ట్ర‌మంతా చంద్ర‌బాబు కోసం ప‌ని చేస్తున్న‌ప్పుడు, తిరుప‌తిలో కూడా ఆ విధంగా ప‌ని చేయ‌క‌పోతే ఆ ప‌త్రిక‌కు కోపం రావ‌డంలో త‌ప్పేం లేదు. కాక‌పోతే తిరుప‌తిలో నారాయ‌ణ‌, రామ‌కృష్ణ లేర‌నే వాస్త‌వాన్ని స‌ద‌రు ప‌త్రిక గుర్తించ‌లేక‌పోయింది.