కొంత కాలంగా వైసీపీ అధిష్టానానికి, శ్రేణులకి దూరమైన మంత్రి గుమ్మనూరు జయరాం ఎట్టకేలకు ముఖ్యమంత్రి కార్యాలయంలో మంగళవారం ప్రత్యక్షమయ్యారు. ఆలూరు నుంచి జయరాం ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు.
తాజాగా అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా గుమ్మనూరు జయరామ్‌ను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా సీఎం ఎంపిక చేశారు. దీంతో జయరాం అలకబూనారు. ఆలూరు నుంచే పోటీ చేస్తానని మంకుపట్టు పట్టారు. ఆలూరు వైసీపీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? అనేది నిర్ణయించుకుంటానని జయరాం బహిరంగంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో టీడీపీలో చేరి ఆలూరు టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కాంగ్రెస్‌లో చేరి ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.
అయితే రోజులు గడిచే కొద్ది వాస్తవం ఆయనకు బోధ పడినట్టుంది. ఎట్టకేలకు అలక వీడి ముఖ్యమంత్రి కార్యాలయానికి జయరాం వెళ్లడం చర్చనీయాంశమైంది. కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానని సీఎం వద్ద చెప్పి వస్తారా? లేక మరేదైనా నిర్ణయాన్ని ప్రకటిస్తారా? అనేది చర్చనీయాంశమైంది. సీఎంవోకు జయరాం వెళ్లడంతో సానుకూల నిర్ణయం వెలువడుతుందని వైసీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.