ఏపీ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన షర్మిలకు ఎల్లో మీడియా పుణ్యమా అని పబ్లిసిటీ బాగానే దక్కుతోంది. వైఎస్సార్ తనయుడు ఏపీని పరిపాలిస్తుండడంతో ఆయన కుమార్తె అన్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహజంగానే మీడియా ప్రాధాన్యం ఇస్తోంది. అందులోనూ జగన్‌ను వ్యతిరేకించే మీడియా ఏపీలో బలంగా వుంది. దీంతో ఎల్లో మీడియాను ఏ మాత్రం నిరుత్సాహ పరచకుండా షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇదే సందర్భంలో రోజాతో షర్మిల తండ్లాట పెట్టుకున్నారు. రోజా నోట్లో నోరు పెడితే ఇంకేమైనా వుందా? అసలే రోజాకు షర్మిల కంటే నోరు ఎక్కువ. రోజా ప్రాతినిథ్యం వహించే నగరికి ఇటీవల వెళ్లిన షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. నగరికి నలుగురు మంత్రులని, జబర్దస్త్‌గా దోచుకుంటున్నారని రోజా, ఆమె రక్త సంబంధీకులపై షర్మిల విరుచుకుపడ్డారు. దీంతో షర్మిలపై ఓ రేంజ్‌లో రోజా ఎదురు దాడి చేస్తున్నారు.
అసలు వైఎస్సార్ పేరు చెప్పుకోకపోతే, నీ ఉనికి ఏంటని రోజా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కేవలం తమ ఇష్టమైన నాయకుడు వైఎస్సార్ కుమార్తె అనే ఏకైక కారణంతో ఊరికే ఉన్నామని రోజా హెచ్చరించారు. తాజాగా షర్మిలపై రోజా మరోసారి విరుచుకుపడ్డారు. వినేవాడు వెర్రి వాడైతే చెప్పే వ్యక్తి షర్మిల అని సెటైర్ విసిరారు.
వైఎస్సార్ తనయ అనే గుర్తింపు తప్ప, అసలు షర్మిలకున్న గుర్తింపు ఏంటని ఆమె నిలదీశారు. పవన్ కల్యాణ్ మాటలు విని విని బోర్ కొట్టడం వల్లే వైఎస్ షర్మిలను రంగంలోకి దించారని దెప్పి పొడిచారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఇప్పుడు టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందని షర్మిలపై మ్ండిపడ్డారు.