వైసీపీకి అధికారుల స‌హాయ నిరాక‌ర‌ణ‌!

వైసీపీకి అధికారుల‌తో పాటు అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగుల నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ ఎదుర‌వుతోంది. ముఖ్యంగా తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో దొంగ ఓట్ల వ్య‌వ‌హారం చినికిచినికి గాలి వాన‌గా మారుతోంది. ఇప్ప‌టికే ఐఏఎస్ అధికారి…

వైసీపీకి అధికారుల‌తో పాటు అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగుల నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ ఎదుర‌వుతోంది. ముఖ్యంగా తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో దొంగ ఓట్ల వ్య‌వ‌హారం చినికిచినికి గాలి వాన‌గా మారుతోంది. ఇప్ప‌టికే ఐఏఎస్ అధికారి గిరీషాతో పాటు తిరుప‌తి డిప్యూటీ క‌మిష‌న‌ర్‌, ఇద్ద‌రు సీఐలు, ఒక ఎస్ఐ, కానిస్టేబుల్ స‌స్పెండ్ అయ్యారు. అలాగే మ‌రో ఇద్ద‌రు సీఐల‌ను వీఆర్‌కు పంపారు. ఇద్ద‌రు కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్స్ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వ‌ర‌కు ఉద్యోగులు మ‌న‌కెందుకొచ్చిన గొడ‌వ‌, రాజ‌కీయ నాయ‌కుల కోసం న‌ష్ట‌పోవాల‌నే అభిప్రాయానికి వ‌చ్చారు. దీంతో ఏరికోరి త‌మ ప్రాంతానికి రెవెన్యూ, పోలీస్‌శాఖ‌ల‌కు సంబంధించి అధికారుల‌ను వేయించుకున్నా, నాయ‌కులు ఆశించిన స్థాయిలో ప‌ని చేసే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. మ‌రి కొంద‌రు ఉద్యోగులు రెండు నెల‌ల కాలానికి పోస్టింగుల కోసం రాజ‌కీయ నాయ‌కులు చెప్పిన‌ట్టు ఎందుకు వినాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. అందుకే త‌మ ప్రాంతానికి రావాల‌ని నాయ‌కులు ఫోన్ చేసి అడుగుతున్నా, అధికారులు ఆస‌క్తి చూప‌డం లేద‌ని స‌మాచారం.

నాయ‌కుల‌కు ఏదో ఒక సాకు చెప్పి త‌ప్పించుకుంటున్నారు. మ‌రీ ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి ఎవ‌రొస్తారో చెప్ప‌లేని రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఉంది. అలాంటప్పుడు అన‌వ‌స‌రంగా ఒక పార్టీ ముద్ర వేయించుకుని భ‌విష్య‌త్‌లో ఎందుకు న‌ష్ట‌పోవాల‌నే ధోర‌ణిలో అధికారులున్నారు.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ త్వ‌ర‌లో రానున్న నేప‌థ్యంలో అధికారులు న్యూట్ర‌ల్ అయ్యారు. అధికార పార్టీ నాయ‌కులు ఫోన్ చేసినా స‌రిగా స్పందించ‌ని ప‌రిస్థితి. ఇదే సంద‌ర్భంలో ప్ర‌తిప‌క్షాల నేత‌లు వెళ్లి ఏవైనా ఫిర్యాదులు చేస్తున్నా సానుకూలంగా స్పందిస్తున్నారు. దీంతో అధికార పార్టీ నాయ‌కులు వేచి చూసే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికార పార్టీ నాయ‌కులు చెప్పిన‌ట్టే వినే అధికారులు… చాలా త‌క్కువ‌నే చెప్పొచ్చు.