తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీఆర్ఎస్కు పెద్దపల్లి సిటింగ్ ఎంపీ వెంకటేష్ నేత గట్టి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వెంకటేష్… పెద్దపల్లి ఎంపీ సీటు దక్కించుకున్నారు. బీఆర్ఎస్ తరపున అత్యున్నత చట్టసభకు ఎన్నికయ్యారు.
ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో అధికార పార్టీ వైపు ఆయన చూపి మళ్లింది. మరోవైపు రానున్న ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ సీటు ఇవ్వనని వెంకటేష్‌కు కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆయన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను ఎంచుకోవడం గమనార్హం.
ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఢిల్లీలో ఆయన కలుసుకున్నారు. కాంగ్రెస్‌లోకి వెంకటేష్‌ను రేవంత్ ఆహ్వానించారు. అనంతరం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంటికి వెంకటేష్‌ను రేవంత్ తీసుకెళ్లారు.
కాంగ్రెస్ జాతీయ నేత చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పెద్దపల్లి ఎంపీ సీటు ఇస్తామనే హామీతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామంతో బీఆర్ఎస్కు రాజకీయంగా షాక్ తగిలినట్టే.