టీడీపీ సీనియర్ నేతల పరిస్థితి దయనీయంగా వుంది. పొత్తులో భాగంగా కొంత మంది సీనియర్ నేతలకు టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తమకు టికెట్లు దక్కవని వాస్తవాన్ని జీర్ణించుకోలేక, అలాగని ఊరికే ఉండలేకపోతున్నారు. దీంతో తమకు తామే టికెట్లను ప్రకటించుకుంటున్నారు.
పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్, తిరుపతి, తెనాలి, విజయవాడ వెస్ట్ తదితర స్థానాలను జనసేనకు కేటాయించారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్న టీడీపీ నేతలు అంగీకరించడం లేదు. రాజమండ్రి రూరల్ సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ మరోసారి తానే అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారని జనసేన చెబుతోంది.
సిటింగ్‌లకు టికెట్ ఇస్తానని చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీని బుచ్చయ్య గుర్తు చేస్తున్నారు. ఒకవేళ అక్కడ జనసేనకే టికెట్ ఇస్తే బుచ్చయ్య ఎలా రియాక్ట్ అవుతారో అనే టెన్షన్ టీడీపీలో నెలకుంది. తిరుపతి సీటు జనసేనకు ఇస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే తనకే టికెట్ ఇస్తారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. ఇవే తనకు చివరి ఎన్నికలంటూ ఆమె సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.
తెనాలిలో కూడా ఇదే పరిస్థితి. జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి. తెనాలి నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా టికెట్ ఆశిస్తున్నారు. నాదెండ్లకు టికెట్ ఇస్తే ఆలపాటి అనుచరులు సహకరించే పరిస్థితి లేదు. నాదెండ్ల ఓడిపోతారని తెలిసినా జనసేనకే తెనాలి సీటు కేటాయించాల్సి వస్తోందని టీడీపీ నేతలు వాపోతున్నారు. కృష్ణా జిల్లా మైలవరంలో కూడా ఇదే తంతు.
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ లేదా జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు. మాజీ మంత్రి దేవినేనికి చెక్ పెట్టేందుకు కృష్ణప్రసాద్‌ను జనసేనలోకి పంపి, టికెట్ ఇవ్వాలని ఆ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. వసంత రాకను దేవినేని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మైలవరం నుంచి తానే బరిలో వుంటానని దేవినేని చెప్పడం గమనార్హం.
దేవినేని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆలపాటి రాజా తదితర కమ్మ సామాజిక వర్గ నేతలే ఎక్కువగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. వీరే కాకుండా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, గుంటా శ్రీనివాస్ లాంటి నేతల భవిష్యత్ ఏంటో అర్థం కాకుండా వుంది. ముఖ్యంగా గంటా శ్రీనివాస్ టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా లేరనే ఆగ్రహం పార్టీ పెద్దల్లో వుంది. కేవలం ఎన్నికల సమయంలోనే ఆయన రాజకీయ తెరపై కనిపిస్తుంటారని, మిగిలిన సమయాల్లో సొంత వ్యవహారాలను చూసుకుంటారనే విమర్శ బలంగా వుంది.
పక్కన పెట్టాలని భావిస్తున్న నాయకులని పొత్తు పేరుతో తెలివిగా చంద్రబాబు తప్పిస్తున్నారనే అభిప్రాయం కూడా టీడీపీలో లేకపోలేదు.