ప‌వ‌న్‌పై కాపుల్లో బ‌ల‌ప‌డుతున్న అనుమానం!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై కాపుల్లో రోజురోజుకూ అభిమానం త‌గ్గిపోతోంది. పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు అతి త‌క్కువ సీట్లు ఇస్తార‌నే క‌థ‌నాలు ఎల్లో మీడియాలో రావ‌డం, వాటిని ఎవ‌రూ ఖండించ‌కపోవ‌డంతో  ప‌వ‌న్‌ను అభిమానించే వారిలో అనుమానం బ‌ల‌ప‌డుతోంది.…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై కాపుల్లో రోజురోజుకూ అభిమానం త‌గ్గిపోతోంది. పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు అతి త‌క్కువ సీట్లు ఇస్తార‌నే క‌థ‌నాలు ఎల్లో మీడియాలో రావ‌డం, వాటిని ఎవ‌రూ ఖండించ‌కపోవ‌డంతో  ప‌వ‌న్‌ను అభిమానించే వారిలో అనుమానం బ‌ల‌ప‌డుతోంది. ప‌వ‌న్ ప్యాకేజీ స్టార్ అని ఇంత కాలం వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం ఉంద‌ని జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సైతం న‌మ్మే ప‌రిస్థితి.

కాపు కురు వృద్ధుడు చేగొండి హ‌రిరామ జోగ‌య్య తాజా లేఖ‌లో ప్ర‌స్తావించిన‌ట్టు టీడీపీకి జ‌న‌సేన అవ‌స‌రం వుంది. అంతే త‌ప్ప‌, జ‌న‌సేన‌కు టీడీపీ అవ‌స‌రం లేదు. ఇస్తేగిస్తే టీడీపీకే జ‌న‌సేన టికెట్లు ఇచ్చేంతగా సామాజిక బలం ప‌వ‌న్‌కు వుంది. కేవ‌లం నాలుగు శాతం సామాజిక బ‌లం ఉన్న టీడీపీ …25 శాతం బ‌లం ఉన్న జ‌న‌సేన‌కు టికెట్లు కేటాయించ‌డం ఏంట‌నే చేగొండి హ‌రిరామ జోగ‌య్య ప్ర‌శ్న కాపుల మ‌న‌సుల్లో వుంది. దాన్నే చేగొండి త‌న లేఖ ద్వారా బ‌హిర్గ‌త ప‌రిచారు.

మంత్రి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించిన‌ట్టు సీట్ల‌లో జ‌న‌సేన‌కు కోత విధించారే త‌ప్ప‌, క్యాష్‌లో కాద‌నే కామెంట్స్ ఆలోచింప జేస్తున్నాయి. ఏ ర‌కంగా చూసినా చంద్ర‌బాబు కంటే ప‌వ‌న్ శ‌క్తిమంతుడు. అలాంట‌ప్పుడు గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్ల‌ను, అధికారంలో భాగ‌స్వామ్యాన్ని ద‌క్కించుకోకుండా, దేనికోసం త్యాగం చేస్తున్నార‌నే ప్ర‌శ్న ఉద‌యించింది. ప‌వ‌న్ త‌న‌కు కావాల్సింది తీసుకుని, టీడీపీకి త‌న ఓటు బ్యాంక్‌ను అమ్ముకున్నారా? అనే అనుమానం ఆయ‌న అభిమానుల్లో అంత‌కంత‌కూ పెరుగుతోంది.

గౌర‌వ ప్ర‌ద‌మైన సీట్లు ఇస్తేనే పొత్తు వుంటుంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. ఇప్పుడు 20-25 సీట్ల‌తో చంద్ర‌బాబు స‌రిపెడుతున్నార‌నే వార్త‌లొచ్చాయి. జ‌గ‌న్‌ను గ‌ద్దె దించ‌డమే ఏకైక ల‌క్ష్యం అయితే, త‌క్కువ సీట్లు తీసుకుని పార్టీ శ్రేణుల్ని అవ‌మానించ‌డం కంటే 2014లో మాదిరిగా అస‌లు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండానే చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోయ‌వ‌చ్చు క‌దా అని జ‌న‌సేన నాయ‌కులు వ్యంగ్యంగా అంటున్నారు.

టీడీపీ వేసే ముష్టి సీట్ల‌ను తీసుకుని ప‌వ‌న్ నోర్మూసుకోవ‌చ్చు కానీ, ఆయ‌న చెప్పిన‌ట్టు చంద్ర‌బాబును సీఎం చేయ‌డానికి సిద్ధంగా లేమ‌ని కాపు నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. అధికారికంగా జ‌న‌సేనకు 40 నుంచి 50 అసెంబ్లీ సీట్లు ఇవ్వ‌క‌పోతే మాత్రం … టీడీపీని ఓడించేందుకు క‌సిగా ప‌ని చేస్తామ‌ని అంటున్నారు. త‌మ నాయ‌కుడు సీఎం కావ‌డ‌మే అంతిమ ల‌క్ష్యం అని, చంద్ర‌బాబు, వాళ్ల కుమారుడు లోకేశ్‌ను సీఎంగా చూడ‌డం త‌మ క‌ల కాద‌ని కాపులు తెగేసి చెబుతున్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో చీము, నెత్తురు ఉన్నాయ‌ని న‌మ్ముతున్నామ‌ని, సీట్ల సంగ‌తి తేలితే నిరూపిత‌మ‌వుతుంద‌ని జ‌న‌సేన నాయ‌కులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. 20 లేదా 25 సీట్ల‌కు ప‌వ‌న్ అంగీక‌రిస్తే, వైసీపీ విమ‌ర్శించిన‌ట్టు ప్యాకేజీ స్టార్ అని తాము కూడా అంగీక‌రిస్తామ‌ని ప‌వ‌న్ అభిమానులు అంటున్నారు.