కుమారి ఆంటీ చాలా రోజుల ముందు నుంచే ఫేమస్. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఆమె పాపులర్. చాలా యూట్యూబ్ వీడియోలున్నాయి. ఎప్పుడైతే పోలీసులు ట్రాఫిక్ సాకుతో ఆమె ఫుడ్ స్టాల్ ను తొలిగించారో ఆ క్షణం నుంచి ఆమె పాపులర్ అయింది.
అదే టైమ్ లో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించి, కుమారి ఆంటీ మళ్లీ ఫుడ్ స్టాల్ పెట్టుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీచేయడంతో ఆమె తెలుగు రాష్ట్రాల్లో కూడా పాపులర్ అయింది. స్వయంగా తను వస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో కుమారి ఆంటీ పొంగిపోయింది.
అయితే ఈ ఆనందం ఆమెకు ఎక్కువ రోజులు నిలవలేదు. తన బిజినెస్ గతంలోనే కంటే మెరుగ్గా ఉంటుందని భావించి ఉండొచ్చు కానీ ఇప్పుడామెకు అదనపు తలనొప్పులు ఎక్కువయ్యాయి..
కుమారి ఆంటీ కేంద్రంగా నిరసనలు.. ఎవరైనా నిరసన తెలపాలంటే మంచి సెంటర్ కావాలి. ఇప్పుడు అలాంటి సెంటర్ గా మారింది కుమారి ఆంటీ స్టాల్. తాజాగా కొంతమంది యువకులు కుమారి ఆంటీ స్టాల్ ముందు పెద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవో-46ను ముఖ్యమంత్రి రద్దు చేయడం లేదని, రేవంత్ రెడ్డి వస్తే ఓ మాట చెప్పాలంటూ కుమారి ఆంటీకి వినతిపత్రం సమర్పించారు.
సహజంగానే ఈ ఎత్తుగడకు మంచి క్రేజ్ వచ్చింది. కెమెరాలన్నీ అటు తిరిగాయి. కానీ ఇదే కుమారి ఆంటీ కొంపముంచింది. తన ఫుడ్ స్టాల్ ముందు గుంపులుగా జనాలు కనిపిస్తున్నారు కానీ, అందులో తినేవాళ్లు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నారనేది ఆమె బాధ. పైగా ఇలా రోజుకో నిరసన జరిగితే రావాల్సిన కస్టమర్లు కూడా రావడం మానేస్తారనేది ఆమె భయం. ఆమె భయంలో అర్థం ఉంది మరి.
మరింత పెరిగిన యూట్యూబర్ల సందడి.. మీడియా అత్యుత్సాహం, అతి ప్రచారం వల్లనే తమ ఫుడ్ స్టాల్ ను పోలీసులు తొలిగించారని కుమారి ఆంటీ సంబంధీకులు ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడా తాకిడి మరింత పెరిగింది. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను కవర్ చేసేందుకు, ఆమె ఇంటర్వ్యూలు తీసుకునేందుకు విజయవాడ, వరంగల్, తిరుపతి, విశాఖపట్నం నుంచి కూడా యూట్యూబర్లు రంగంలోకి దిగిపోతున్నారు. దీంతో కుమారి ఆంటీ బిజినెస్ దెబ్బతినేలా ఉంది.
ఈమధ్య జరిగిన పరిణామాలతో తన బిజినెస్ మరింత పెరుగుతుందని కుమారి ఆంటీ భావించి ఉండొచ్చు. కానీ తన దుకాణాన్ని ఇలా ప్రచారానికి వాడేస్తారని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు.