ఎన్నికలు సమీపిస్తున్నా తెలగుదేశం, జనసేన మధ్య పొత్తు కొలిక్కిరావడం లేదు. పొత్తుల వ్యవహారం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అనే చందంగా సాగుతోంది. అసలు పొత్తు వుంటుందా? వుండదా? అనే సందేహమూ తలెత్తుతోంది. ఇది రెండు పార్టీల కార్యకర్తలను సతమతం చేస్తోంది.
టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇరు పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడానికి కసరత్తు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. సీట్ల సర్దుబాటుపైనా కసరత్తు జరుగుతున్నట్లు చెబుతూ వస్తున్నారు.
రెండు పార్టీలు ఉమ్మడిగా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని, ఇందుకు ప్రాతిపదికగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇటువంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ,`జనసేన ఉమ్మడి సమావేశాలు జరిగాయి.
ఇక అభ్యర్థులను ప్రకటించడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో పొత్తుపై స్తబ్ధత ఏర్పడింది. ఉమ్మడి సమావేశాలు జరగడం లేదు. అభ్యర్థుల ప్రకటన వెలువడటం లేదు. పైగా తమతో సంప్రదించకుండా చంద్రబాబు నాయుడు రెండు నియోజక వర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారని, పవన్ కళ్యాణ్ కూడా రెండు నియోజక వర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు. ఇక్కడి నుంచే పొత్తుపై అనుమానాలు మొదలయ్యాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదటి నుంచి దూకుడుగా వున్నారు. వైసీపీని గద్దె దించడం కోసం అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేస్తానని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకడానికి ఆస్కారం ఇవ్వబోమని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన సందర్భంగా రాజమండ్రి జైలు వద్ద మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్…రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించేశారు.
దీనికి ముందు నుంచే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో వున్నారు. మిత్రపక్షమైన బీజేపీతో చర్చించకుండానే ఆయన టీడీపీతో పొత్తును ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని, ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని పవన్ అనేక సార్లు ప్రకటించారు. బీజేపీ మాత్రం ఇప్పటిదాకా తెలుగుదేశంతో పొత్తుపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. కనీస ఆసక్తి చూపలేదు. ఇక్కడే పవన్ ఇరకాటంలో పడ్డారు.
అసలు సమస్య కాంగ్రెస్‌తో మొదలయింది. అనూహ్యంగా వైఎస్ షర్మిలా కాంగ్రెస్‌లో చేరడం, అమెను పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేయడం వెనుక చంద్రబాబు వ్యూహం వుందని ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు నాయుడు ఇటు పవన్ ద్వారా బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తూనే అటు షర్మిలను ఆసరా చేసుకుని కాంగ్రెస్‌కు చేరవయ్యారు. కాంగ్రెస్ బలపడితే… ఆ మేరకు వైసీపీ బలహీనపడుతుందని, అంతిమంగా తమకు మేలు జరుగుతుందన్నది బాబు ఆశ. షర్మిల వల్ల కాంగ్రెస్‌లో ఎంతోకొంత ఉత్సాహం నెలకొంది. పార్టీ బలపడుతుందన్న ఆశ ఆ పార్టీ శ్రేణుల్లో మొలకెత్తింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడటం బీజేపీకి ఏ మాత్రం ఇష్టం లేదు. ఆ మాటకొస్తే దేశంలో ఏమూలనైనా ఇసుమంత కూడా కాంగ్రెస్ బలపడటాన్ని బీజేపీ అంగీకరించదు. ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి చంద్రబాబు తోడ్పాటునిస్తున్నారని బీజేపీ కేంద్ర పెద్దలు గట్టిగా నమ్ముతున్నారు. తెలంగాణ ఎన్నికల్లోనూ తెలుగుదేశం కార్యకర్తలంతా కాంగ్రెస్‌కు ఓట్లేశారు. తమవల్లే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని తెలుగుదేశం నాయకులే చెప్పుకుంటున్నారు.
ఈ పరిస్థితే జనసేన, టీడీపీ పొత్తుకు ఆటంకంగా మారింది. కాంగ్రెస్‌తో అంటగాగుతున్న తెలుగుదేశంతో పొత్తు ప్రసక్తే లేదని ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పవన్‌తో బీజేపీ పెద్దలు తేల్చిచెప్పినట్లు సమాచారం. అప్పటి నుంచి పవన్ పునరాలోచనలో పడినట్లున్నారు. బీజేపీని వదిలేసి టీడీపీతో వెళ్లడమా? లేక టీడీపీ పొత్తును అటకెక్కించి బీజేపీతో కొనసాగడమా? అనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి పవన్‌కు ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల పొత్తు వ్యవహారంలో స్తబ్ధత నెలకొంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలకూ బ్రేక్ పడింది.
ఇదిలా వుండగా…. పవన్‌తో వెళ్లడం కష్టమేనని టీడీపీ కూడా భావిస్తోంది. తమ అవసరాన్ని అవకాశంగా తీసుకుని పవన్ ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే పరిస్థితి వుందని, అందుకే పవన్‌తో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్, వామపక్షాలతో కలసి వెళ్లడం మేలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
ఈ పరిణామాల క్రమంలో టీడీపీ-జనసేన పొత్తు పొడవక ముందే అస్తమించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మిగిలింది అధికారికంగా ప్రకటించమేనని అంటున్నారు.
– ఆదిమూలం శేఖర్