పాదాలు కదపని చోట లోకేష్ శంఖారావం!

తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ పాదయాత్ర యువగళం అన్న భారీ కార్యక్రమం విశాఖ గడప దాటలేదు. దాన్ని అక్కడే ఆపేసి అర్ధాంతరంగా ముగించేశారు. ఏమంటే ఎన్నికల హడావుడి అన్నారు. యువగళం ముగిసిన…

తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ పాదయాత్ర యువగళం అన్న భారీ కార్యక్రమం విశాఖ గడప దాటలేదు. దాన్ని అక్కడే ఆపేసి అర్ధాంతరంగా ముగించేశారు. ఏమంటే ఎన్నికల హడావుడి అన్నారు. యువగళం ముగిసిన నలభై అయిదు రోజుల తరువాత టీడీపీకి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు గుర్తుకు వచ్చాయి.

ఈ రెండు జిల్లాలలోనూ లోకేష్ పర్యటించడానికి శంఖారావం అని పేరు పెట్టారు. యువగళంతో పాదయాత్రను తన పాదాలను తీసుకెళ్ళని ఈ జిల్లాలలో లోకేష్ శంఖారావం పూరిస్తారు. కుప్పం టూ ఇచ్చాపురం అన్న ట్యాగ్ లైన్ కి న్యాయం చేయడానికో లేక ఆయా జిల్లాలలో తాను పర్యటించలేదు కాబట్టి కవర్ చేయడానికో లోకేష్ శంఖారావం పేరిట ఈ టూర్ పెట్టుకున్నారు

ఈ నేపధ్యంలో లోకేష్ ఈ నెల 5న ఇచ్చాపురంలో జరిగే సభలో ప్రసంగిస్తారు. 7న పాలకొండ, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో లోకేష్ శంఖారావం స‌భ‌లు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా ఈ నెల 8న సాలూరు, బొబ్బిలి, రాజాంలో జరిగే సభల్లో పాల్గొంటారు. 9న చీపురుపల్లి, ఎచ్చెర్ల, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 10న విజయనగరం, గజపతినగరం, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో పర్యటించి ఆయా చోట్ల జరిగే స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు.

ఇలా యువగళం పాదయాత్రకు బదులుగా ఈ జిల్లాలలో లోకేష్ శంఖారావం అన్న మాట. ఈసారి జరిగే ఎన్నికలు టీడీపీకి చావో అన్నట్లుగా ఉన్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలి. లేకపోతే మొత్తం పార్టీయే డ్యామేజ్ లో పడుతుంది. అందుకే చంద్రబాబు జిల్లాలో జరిగే సభలకు రా కదలిరా అంటూ పేరు పెట్టి జనంలోకి వెళ్తున్నారు.

నిజం గెలవాలి అంటూ నారా భువనేశ్వరి చంద్రబాబు అరెస్ట్ తరువాత మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్రను చేపడుతున్నారు. ఇప్పుడు తనయుడు నారా లోకేష్ శంఖారావం అంటున్నారు. ఇలా నారా కుటుంబం మొత్తం ఎన్నికలు అయ్యేంతవరకూ ఏదో ట్యాగ్ లైన్ తో జనంలో ఉండాలని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది.

అందులో భాగమే ఈ టూర్లు అని అంటున్నారు. టూర్లు ఎన్నికల సీజన్‌లో చేస్తే లాభిస్తుందా అన్నది ఒక పాయింట్. ఎవరేమిటి అన్నది ఏపీ జనాలకు తెలుసు. అయితే ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటారు. జనాశీర్వాదం ఎవరికి దక్కుతుంది అన్నది ఎన్నికల ఫలితాలు చెబుతాయి.