యాత్ర 2 ట్రైలర్ శనివారం విడుదలైంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేలా డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మహీ వి.రాఘవన్ తెరకెక్కించారు. గతంలో యాత్ర-1 సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యాత్ర-2 ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. యాత్ర-1లో కేవలం దివంగత వైఎస్సార్ మాత్రమే కనిపించారు.
తాజా చిత్రంలో వైఎస్సార్‌తో పాటు ఆయన కుమారుడు వైఎస్ జగన్ పాత్ర తెరకెక్కడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి, జగన్ క్యారెక్టర్‌ను జీవా పోషిస్తున్నారు. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ట్రైలర్‌లో కొన్ని డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
ముఖ్యంగా వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం, దాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకులు కుట్రపన్నుతారు. ఇందుకు సంబంధించిన సీన్స్ సినిమాలో చూడొచ్చు. ఈ ట్రైలర్‌లో కాంగ్రెస్ నాయకుల హెచ్చరికలున్నాయి. దేశంలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలంటే భయపడేలా వుండాలనే కాంగ్రెస్ అగ్రనాయకుడి వార్నింగ్, దాన్ని లెక్క చేయకుండా జగన్ జనంలోకి వెళ్లడాన్ని చూడొచ్చు.
“జగన్‌రెడ్డి కడపోడు సార్. శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత, వాడు నాశనమైపోతాడని తెలిసినా శత్రువుకి తల వంచడు సార్” అని కాంగ్రెస్ అగ్ర నాయకుడికి ఏపీ నాయకుడు చెప్పే సీన్ హైలెట్‌గా నిలిచింది.
అలాగే మరో సీన్‌లో ఒక అంధ వ్యక్తి… “నువ్వు మా వైఎస్సార్ కొడుకు అన్నా. మాకు నాయకుడిగా నిలబడు అన్నా. అన్నా ఉన్నావా అన్నా…అన్నా” అని చీకట్లో వెతుకుతూ పిలుస్తాడు. అతని చేతిలో వైఎస్సార్ ఫొటో వుంటుంది.
ఆ అంధ వ్యక్తి మాటలకు జగన్ సమాధానంగా… “నేను ఉన్నాను, నేను విన్నాను” అని భరోసా ఇస్తాడు. ఇవే కాకుండా తాజా ట్రైలర్‌లోని మరికొన్ని విశేషాలున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? చూద్దామా? అని వైఎస్సార్, ఆయన తనయుడి అభిమానులు ఎదురు చూసేలా ట్రైలర్ వుంది.