వైసీపీకి గాజువాక ట్రబుల్స్!

ఉమ్మడి విశాఖలోనే కాదు ఏపీలో హాట్ సీటుగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. గాజువాకలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతోనే దానికి సినీ పొలిటికల్ గ్లామర్ వచ్చింది. పవన్ పోటీ ఒక ఎత్తు అయితే…

ఉమ్మడి విశాఖలోనే కాదు ఏపీలో హాట్ సీటుగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. గాజువాకలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతోనే దానికి సినీ పొలిటికల్ గ్లామర్ వచ్చింది. పవన్ పోటీ ఒక ఎత్తు అయితే ఆయన ఓటమి తో కూడా గాజువాక మారుమోగిపోయింది. గాజువాక నుంచి మళ్లీ పవన్ ని పోటీ చేయమని అంతా కోరుతున్నారు కానీ ఆయన మాత్రం ఆ వైపు చూడడమే లేదు. 2019 నాటి చేదు అనుభవాలే అందుకు కారణం అని అంటున్నారు.

పవన్ సంగతి పక్కన పెడితే గాజువాకలో మరోసారి జెండా ఎగరేయాలని వైసీపీకి ఆశలు ఉన్నాయి. ఈసారి కూడా గెలిచేస్తే గాజువాక వైసీపీకి కంచుకోట అని చెప్పుకోవడానికి ఉంటుందని అధికార పార్టీ ఆలోచన. విపక్షం ఊరుకుంటుందా. అందులో జనసేన 2019 నాటి పరాభవానికి తగిన పరిహారం తీర్చుకోవాలని చూస్తోంది.

అందుకే ఈ సీటు నుంచి జనసేన పొత్తులో భాగంగా పోటీ చేస్తుందని అంటున్నారు. ఈ పోరుని ఎలా ఎదుర్కోవాలన్నది వైసీపీకి బోధపడడంలేదు అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ని ఓడించిన జెయింట్ కిల్లర్ గా  ఉన్న తిప్పల నాగిరెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించింది. ఆయన పనితీరు పట్ల జనంలో వ్యతిరేకత ఉందని భావిస్తోంది.

అయితే ఆయనకు సరైన ఆల్టర్నేషన్ గా ఎవరిని తేవాలో తెలియక ఒక కార్పోరేటర్ ని తెచ్చి ఇంచార్జిగా చేసింది. దాంతో గాజువాకలో రచ్చ తారస్థాయికి చేరుకుంది. తిప్పలే నయం అన్న పరిస్థితి ఏర్పడుతోంది. తిప్పల వర్గం ఈ విషయంలో ఏ మాత్రం ఊరుకునేది లేదు అంటోంది. తమకు సీటు ఇచ్చినా లేకపోయినా పర్వాలేదు కానీ కార్పోరేటర్‌గా ఉన్న ఉరుకూటి రామచంద్రరావుకు టికెట్ వద్దే వద్దు అని అధినాయకత్వానికి మొర పెట్టుకుంది.

అరకు అసెంబ్లీ ఇంచార్జిని మళ్లీ మార్చేసిన వైసీపీ అధినాయకత్వం తీరుని గమనించిన గాజువాక వైసీపీ నేతలు కొత్త ఇంచార్జి కావాలని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో విశాఖ మేయర్ గా ఉన్న గొలగాని హరి వెంకట కుమారిని గాజువాక ఇంచార్జిగా నియమిస్తారు అని అంటున్నారు.

ఆమె మేయర్ గా మంచి మారుకే తెచ్చుకున్నారు ఆమె కూడా ఉరుకూటి సామాజికవర్గమే కాబట్టి ఆయన్ని తీసేసి ఈమెకు ఇచ్చారు అన్న చెడ్డ పేరు రాదు, సామాజిక సమీకరణలు సరిపోతాయని భావిస్తున్నారుట. తొందరలో గాజువాకకు మేయర్ ఇంచార్జి అవుతారు అని అంటున్నారు. అప్పటికైనా వైసీపెకి గాజువాక ట్రబుల్స్ తీరిపోతాయా అన్నదే చూడాలి.