ప్రత్యేక హోదా అంటూ అడ్డగోలు విభజన జరిగిన పదేళ్ల తరువాత కాంగ్రెస్ ఏపీ కొత్త ప్రెసిడెంట్ షర్మిల గొంతు పెద్దది చేస్తున్నారు. అసలు ప్రత్యేక హోదా కంటే ముందు కాంగ్రెస్ ఏపీకి చేసిన అన్యాయం చెప్పమంటే మాత్రం ఆమెతో పాటు కాంగ్రెస్ నేతలకు నోరు రావడంలేదు. రోడ్ యాక్సిడెంట్ చేసి రోగిని ఆసుపత్రిలో ఎవరూ చేర్చలేదు మేము చేరుస్తామని కాంగ్రెస్ షర్మిల అన్నట్లుగా ఉంది.
అసలు ఆసుపత్రి కంటే ముందు రోడ్డు యాక్సిడెంట్ ప్రస్తావన ముఖ్యం కదా. అలా దారుణంగా గుద్దించేసిన వారు ఆసుపత్రికి తీసుకెళ్ళి కట్టుకట్టేస్తే తప్పు పోతుందా పాపం పరిహారం అవుతుందా అని మేధావులు అయిన వారు నిలదీస్తున్నారు.
ఏపీని దుర్మార్గంగా కాంగ్రెస్ విభజించింది అన్నది ఎవరికీ తెలియకుండా హస్తం పార్టీ పెద్దలు మాట్లాడే మాటల గారడీయే ప్రత్యేక హోదా అన్నది అత్యధిక అభిప్రాయంగా ఉంది. ప్రత్యేక హోదా అన్న మాట ఏ పార్టీ అయినా అంటే బాగుంటుందేమో కానీ కాంగ్రెస్ అంటే అసలు బాగోదని అంటున్నారు. ఎక్కడైనా ఇల్లు కూల్చేసిన వారు మేము పాక కట్టుకోవడానికి సాయం చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా అన్నదే ఇక్కడ ప్రశ్న.
ప్రత్యేక హోదా అంటూ నడుం బిగించి మరీ ఢిల్లీలో షర్మిల ఒక రోజు దీక్ష చేస్తున్న నేపధ్యంలో ఎట్టకేలకు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఆమె మాత్రం ఏమంటారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు చెప్పిన మాటలనే వల్లె వేశారు. హోదా అన్నది ముగిసిన అధ్యాయం అన్నారు.
అంతే కాదు ఆ హోదాను అలా ముగించిన తప్పు బీజేపీ పెద్దలది కాదు టీడీపీ అధినేత చంద్రబాబుదని కూడా చెప్పారు. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజి అని అనకపోతే హోదా ఉండేదేమో కానీ ఆయన ప్యాకేజీ అని హోదాని ముగించేలా చేశారు అన్నట్లుగా పురంధేశ్వరి చెబుతున్నారు
అంతే కాదు హోదా కంటే ఎక్కువ నిధులను ఏపీకి ఇచ్చినా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని బాగుచేయడంతో విఫలం అయ్యాయని ఆమె విమర్శించారు. అసలు తప్పులు అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలదే అని ఆమె అంటూ కేంద్రాన్ని నిందించడం ఏంటని కూడా అంటున్నారు.
షర్మిల ప్రత్యేక హోదా అంటే అది ఎండింగ్ చాప్టర్ అని పురంధేశ్వరి కౌంటర్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వాలదే అభివృద్ధి బాధ్యత అన్నారు. అంటే కేంద్రం వద్దకు వెళ్ళి ఆందోళనలు చేయడమేంటి అన్నదే ఆమె షర్మిలకు ఇండైరెక్ట్ గా వేస్తున్న ప్రశ్నగా ఉంది.
హోదా అంశం మరుగున పడడానికి మంట కలిసిపోవడానికి బాబు ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదన కారణం కాబట్టి కాంగ్రెస్ సహా టీడీపీ వైసీపీ అంతా గుర్తించాలని ఆమె కోరుతున్నారు. షర్మిలకు డౌట్లు ఏమినా ఇంకా ఉంటే పురంధేశ్వరి కామెంట్స్ తో తీరిపోయి ఉండాల్సిందే అంటున్నారు.