ఒకప్పట్లా హీరోయిన్లు తమ సమస్యల్ని బయటపెట్టడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. మొన్నటికిమొన్న సమంత తన హెల్త్ కండిషన్ ను బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకంటే ముందు శృతిహాసన్, తన ఆరోగ్య సమస్యను బయటపెట్టింది.
ఇలా చాలామంది హీరోయిన్లు తాము ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల్ని బయటపెట్టారు. ఇప్పుడీ లిస్ట్ లోకి నటి పూనమ్ కౌర్ కూడా చేరింది. గతంలో తను తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడిన విషయాన్ని బయటపెట్టింది.
పూనమ్ కౌర్ గతంలో ఫైబ్రోమయాల్జియా అనే సమస్యతో బాధపడిందంట. ఇది కూడా ఓ రకమైన మయోసైటిస్ లాంటిదే. ఫైబ్రోమయాల్జియా బాధితులు తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు. శరీరం నిస్సత్తువుగా మారుతుంది. అలసటతో పాటు నిద్రలేమితో బాధపడతారు.
ఈ సమస్యతో తను చాన్నాళ్లు బాధపడినట్టు వెల్లడించింది పూనమ్ కౌర్. చేతులు, కాళ్లు పట్టేసేవని, టైట్ గా ఉండే దుస్తులు ధరించలేక, దాదాపు రెండేళ్ల పాటు వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాల్సి వచ్చిందని వెల్లడించింది.
అలా చాన్నాళ్లు బాధపడిన తర్వాత నేచురోపతిలో పేరుగాంచిన మంతెన సత్యనారాయణను కలిశానని, ఆయనిచ్చిన సలహాలు తనకు బాగా ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్.