డిజిటల్ మార్కెట్ బాగా స్లోగా వుందని టాలీవుడ్ లో నిర్మాతలు కిందా మీదా అవుతున్నారు. కానీ సరైన ప్రాజెక్ట్ వుంటే మాత్రం ఓటిటి ప్లాట్ ఫారమ్ లో స్పీడ్ గా ముందుకు వస్తున్నాయి.
అలా వచ్చి, నెట్ ఫ్లిక్స్ సంస్థ నాని-వివేక్ ఆత్రేయ సినిమా సరిపోదా శనివారం ను చటుక్కున కొనేసింది. సౌత్, నార్త్ ఏరియాల రైట్స్ కింద ఆ సినిమాకు 45 కోట్లు చెల్లించబోతోంది. సినిమా బడ్జెట్ లో దాదాపు సగం వరకు ఈ డిజిటల్ రైట్స్ నే రాబట్టేసాయి. ఇంకా హిందీ శాటిలైట్, తెలుగు శాటిలైట్, అడియో రైట్స్ వుండనే వున్నాయి.
ఈ సినిమాకు గాను హీరో నానికి 27 కోట్ల రెమ్యూనిరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఎస్ జె సూర్యకు పది కోట్ల రెమ్యూనిరేషన్ ఇస్తున్నారు. ఇంకా మిగిలిన రెమ్యూనిరేషన్లు అన్నీ కలిపి, కేవలం పారితోషికాలకే 50 కోట్ల ఖర్చవుతోంది. యాక్షన్ సినిమా కావడంతో 120 రోజుల వర్కింగ్ డేస్ అవసరం పడుతున్నాయి. దాని వల్ల మొత్తం నిర్మాణ వ్యయం వంద కోట్ల మేరకు వుంటుందని తెలుస్తోంది.
నాని థియేటర్ మార్కెట్ ముఫై కోట్ల మేరకు వుంది. నాన్ థియేటర్ మార్కెట్ 80 కోట్ల మేరకు వచ్చేలా వుంది. ఆ విధంగా, అన్ని విధాలుగా ఈ సినిమా నాని కెరీర్ లో భారీ సినిమా అవుతుంది.