వైసీపీ మేనిఫెస్టోపై ఇదీ అంచ‌నా!

వైసీపీ మేనిఫెస్టోపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కుంది. మ‌రీ ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష పార్టీలు వైసీపీ మేనిఫెస్టో కోసం ఉత్కంఠ‌తో  ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే సీఎం వైఎస్ జ‌గ‌న్ మాట ఇస్తే నిల‌బెట్టుకుంటాడ‌నే న‌మ్మ‌కం ఉండ‌డ‌మే. గ‌త…

వైసీపీ మేనిఫెస్టోపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కుంది. మ‌రీ ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష పార్టీలు వైసీపీ మేనిఫెస్టో కోసం ఉత్కంఠ‌తో  ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే సీఎం వైఎస్ జ‌గ‌న్ మాట ఇస్తే నిల‌బెట్టుకుంటాడ‌నే న‌మ్మ‌కం ఉండ‌డ‌మే. గ‌త ఎన్నిక‌ల ముందు న‌వ‌ర‌త్నాల పేరుతో సంక్షేమ ప‌థ‌కాల‌పై వైసీపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు… న‌వ‌ర‌త్నాల సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంతో త‌న చిత్త‌శుద్ధిని చాటుకున్నారు. సీపీఎస్ ర‌ద్దు, మ‌ద్య‌పాన నిషేధం లాంటి రెండు మూడు హామీల‌ను మిన‌హాయిస్తే, సామాన్య జ‌నానికి ప్ర‌తిదీ నెర‌వేర్చిన ఘ‌న‌త సొంతం చేసుకున్నారు. అందుకే ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఇచ్చే హామీల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి.

ఈ నేప‌థ్యంలో రైతు, డ్వాక్రా రుణ‌మాఫీలుంటాయ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు రైతు, డ్వాక్రా రుణ‌మాఫీలుండ‌వ‌ని తెలిసింది. ప్ర‌స్తుతం రైతుల‌కు ఏడాదికి ఇస్తున్న రూ.13,500 భ‌రోసా సొమ్మును పెంచే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం. ఈ సొమ్మును రూ.20 వేలు లేదా మ‌రో వెయ్యి పెంచనున్న‌ట్టు తెలిసింది. ఇందులో కేంద్రం వాటా య‌ధావిధిగా వుంటుంది.

ఇదిలా వుండ‌గా డ్వాక్రా రుణ‌మాఫీని జ‌గ‌న్ చిత్త‌శుద్ధితో చేశారు. నాలుగు విడ‌త‌లుగా మ‌హిళ‌ల రుణ‌మాఫీ చేసి వారి ఆద‌ర‌ణ చూర‌గొన్నారు. ఈ ద‌ఫా మ‌హిళ‌ల‌కు జ‌గ‌న్ ఎలాంటి హామీ ఇస్తార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. గ‌తంలో కంటే ప్ర‌తి విష‌యంలోనూ అధిక ల‌బ్ధి క‌లిగించేలా మేనిఫెస్టో వుంటుంద‌ని అంటున్నారు. అమ్మఒడి ల‌బ్ధిని రూ.15 వేల నుంచి రూ.20 వేల‌కు పెంచే ఆలోచ‌న ఉన్న‌ట్టు స‌మాచారం. అలాగే పింఛ‌న్‌ను 3 వేల నుంచి రూ.4 వేల‌కు విడ‌త‌ల వారీగా పెంచ‌నున్నారు. ఈ ఐదేళ్ల‌లో అమ‌లు చేసిన ప‌థ‌కాలనే తిరిగి కొన‌సాగిస్తామ‌ని, వాటి ల‌బ్ధిని పెంచుతామ‌ని జ‌గ‌న్ హామీ ఇవ్వ‌నున్న‌ట్టు వైసీపీ ముఖ్య నేత‌లు చెబుతున్నారు.