జనసేన బలమంతా ఉభయగోదావరి జిల్లాల్లోనే. ఆ రెండు జిల్లాల్లో పవన్‌కల్యాణ్ సామాజిక వర్గం గెలుపోటములను శాసించే స్థితిలో ఉంది. దీన్ని ఎవరూ కాదనలేరు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఈ రెండు జిల్లాలే కీలకం. పవన్‌తో పొత్తు పెట్టుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్లో గంపగుత్తగా సీట్లన్నీ తమ ఖాతాలో వేసుకోవచ్చని చంద్రబాబు ఆశించారు.
పొత్తు సవ్యంగా జరిగి వుంటే, టీడీపీ-జనసేన కూటమి ఆశించినట్టుగా కనీసం 25 సీట్లైనా వారి ఖాతాలో పడేవి. కానీ జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లు మాత్రమే దక్కాయన్న అసంతృప్తి పవన్ అనుచరుల్లో బలంగా వుంది. అంతేకాకుండా, రాజమండ్రి రూరల్, తణుకు అసెంబ్లీ సీట్ల విషయంలో పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చినా, చివరికి టీడీపీ దక్కించుకుంది. దీంతో తాము వంచనకు గురయ్యామనే ఆవేదన జనసేన శ్రేణుల్లో వుంది.
చంద్రబాబు ప్రలోభాలకు పవన్ లోనై, జనసేనను బలిపెడుతున్నారనే అనుమానం శ్రేణుల్లో బలపడింది. దీంతో ఒక్కొక్కరుగా నాయకులు జనసేనను వీడుతున్నారు. పొత్తు పెట్టుకుంటే కాపుల ఓట్లన్నీ టీడీపీ,జనసేన కూటమికే పడతాయనే ఆశలు క్రమంగా గల్లంతు అవుతున్నాయి. ఈ ప్రమాదాన్ని పవన్‌కల్యాణ్ గ్రహించారు.
అందుకే ఆయన ఉభయగోదావరి జిల్లాల్లో పోటీ చేయడానికి భయపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మొదట భీమవరంలో పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు, లోకేశ్‌ల నుంచి ఆయన అనుమతి కూడా పొందారు. సర్వేల్లో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను ఎదుర్కోలేమని తేలింది. దీంతో అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకున్నారు. అనంతరం పిఠాపురంపై పవన్ దృష్టి సారించారు.
పిఠాపురంలో 90 వేలకు పైగా కాపుల ఓట్లు ఉన్నాయని, గెలుపుపై భయపడాల్సిన పనిలేదని చాలా మంది చెబుతున్నా పవన్‌లో ఎక్కడో ఆందోళన. పిఠాపురంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర కసరత్తును పవన్ గమనించారు. ఎలాగైనా తనను ఓడించడానికి జగన్ పని చేస్తారని పవన్ భయపడ్డారు. మరీ ముఖ్యంగా టీడీపీ ఇన్చార్జ్ వర్మను చివరి నిమిషంలో అయినా జగన్ పార్టీలోకి తీసుకుని పవన్‌పై పోటీ చేయిస్తారనే సమాచారాన్ని జనసేనానికి అందించారు.
ఈ నేపథ్యంలో పవన్ సురక్షితమైన నియోజకవర్గం కోసం వేట మొదలు పెట్టారు. ఇప్పుడాయన దృష్టి తిరుపతిపై పడింది. తిరుపతి నియోజకవర్గంలో మీ మద్దతు ఎవరికి అంటూ… కూటమి నుంచి పవన్‌కల్యాణ్, వైసీపీ తరపున భూమన అభినయ్ అభ్యర్థిత్వాలతో రెండు రోజులుగా ఐవీఆర్ సర్వే కాల్స్ ఆ నియోజకవర్గ ఓటర్లకు వెళ్తున్నాయి. దీంతో తిరుపతి ఓటర్లు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. భీమవరం, పిఠాపురంలలోనే పవన్‌కు సానుకూలత లేకపోతే, ఇక తిరుపతిలో మాత్రం వుంటుందని ఎలా అనుకుంటున్నారో వారికే తెలియాలి. ఒకవేళ పవన్ తిరుపతిలో పోటీ చేస్తే, తలకిందులు తపస్సు చేసినా ఎందుకు గెలవలేరో రానున్న రోజుల్లో చెప్పుకుందాం.
కానీ ఒక్కటైతే నిజం. ఇటీవల తాడేపల్లిగూడెం సభలో పవన్‌కల్యాణ్ విపరీత వ్యాఖ్యలు కాపుల్లో కోపం తెప్నించాయి. ఆయనపై ఇష్టం స్థానంలో ఆగ్రహం, అసహనం కలిగించాయి. 24 అసెంబ్లీ సీట్లు తక్కువని బాధపడేది ఆయన సామాజిక వర్గీయులే. సీట్లపై తనకు సలహాలివ్వొద్దని, అలాంటి వాళ్లు తనకు అవసరం లేదని పవన్ అనడంపై కాపుల మనసులు తీవ్రంగా గాయపడ్డాయి. మాట జారి, బాగున్న చోట వ్యతిరేకత మూటకట్టుకున్నారు.
ఇప్పుడు గెలిచే సీటు కోసం తిరుగుతున్నారు. పవన్‌కు శత్రువులెవరూ అవసరం లేదు. ఆయనకు ఆయనే శత్రువు. గతంలో పాలకొల్లులో తన అన్న చిరంజీవిని ఓడగొట్టడాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు తనకూ అదే గతి పడుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. బహిరంగ సభల్లో భారీ డైలాగ్‌లు కొడుతూ, తీరా ఆచరణకు వచ్చే సరికి భయాందోళనతో ఏవేవో చేస్తున్నారాయన. ఇంతకూ పవన్ గెలిచే నియోజకవర్గం ఏంటో వెతికి పెట్టండయ్యా!