అలనాటి డ్రీమ్ గర్ల్, ఇప్పటికీ జయప్రదను ఆరాధించే వాళ్లు బోలెడుమంది! ఇదిగాక పొలిట్ కల్ కెరీర్! లోక్ సభ మాజీ సభ్యురాలు, 2019లో కమలం పార్టీలో చేరి యూపీ నుంచినే పోటీ చేశారు! అప్పుడేవో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన కేసులు నమోదయ్యాయి. రాజకీయ నేతలపై ఇలాంటి కేసులు రొటీనే! రాత్రి పది తర్వాత ప్రచారం చేశారనో, మరో రకంగానే ఇలాంటి కేసులు నమోదవుతూ ఉంటాయి. ఇవంత తేలికగా తెగవు కూడా! వీటిని నేతలు హాజరీతో ఎదుర్కొంటూ ఉంటారు.
అయితే ఇక తనకు రాజకీయాలే వద్దనుకుందో ఏమో కానీ.. జయప్రద ఈ కేసుల్లో కోర్టు నోటీసులను పట్టించుకోనట్టుగా ఉంది. ఇప్పటికే ఆమె విచారణకు గైర్హాజరు కాకపోవడం గురించి చాలా వార్తలు వచ్చాయి! ఇప్పటి వరకూ న్యాయస్థానం ఏడు సార్లు సమన్లు జారీ చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎంపీఎమ్మెల్యేలపై వచ్చే కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం పలు దఫాలుగా ఆమె ను న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఆమె ఖాతరు చేయకపోవడం గమనార్హం.
దీనిపై పోలీసులు కోర్టుకు సమాచారం ఇస్తూ.. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుందని, తమకు అందుబాటులో లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టుకు న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడం గమనార్హం! ఆమెను అరెస్టు చేసి అయినా మార్చి ఆరో తేదీ నాటికి న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ప్రత్యేక న్యాయస్థానం పేర్కొనడం ఆసక్తిదాయకంగా మారింది.
రాజకీయంగా కెరీర్ పై అనాసక్తి జయప్రదలో ఏర్పడి ఉండవచ్చు! లేదా తను ఇప్పుడు బీజేపీ కాబట్టి ఏం కాదనీ అనుకుని ఉండవచ్చు! అయితే .. లేటు వయసులో ఇలాంటి అరెస్టు ఆదేశాల వరకూ తెచ్చుకోవడం ఆమె తన అభిమానులనే హర్ట్ చేసే అంశం!