పవన్‌కల్యాణ్‌కు రాజకీయం ఎలా వుంటుందో సొంత పార్టీ నాయకులు రుచి చూపిస్తున్నారు. ఇంత కాలం మాటలతో మభ్యపెడుతూ వచ్చిన పవన్‌కల్యాణ్… కీలకమైన సీట్ల పంపిణీ దగ్గరికి వచ్చే సరికి చేతులెత్తేశారు. చంద్రబాబు చెప్పిందానికల్లో గంగిరెద్దులా తలూపుతుండడంతో జనసేన నాయకులకు మండుతోంది. వేలాది మంది జనసేన కార్యకర్తలు, నాయకుల సమక్షంలో టికెట్‌కు హామీ ఇచ్చినా, ఆచరణకు నోచుకోకపోవడంపై రగిలిపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, ఏలూరు నియోజకవర్గాల జనసేన ఇన్‌చార్జ్‌లు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం అలంపురం సమీపంలోని జయా గార్డెన్‌లో టీడీపీ-జనసేన నిర్వహించ తలపెట్టిన ఉమ్మడి సభకు వెళ్లకూడదని తణుకు, ఏలూరు నియోజకవర్గాల జనసేన నాయకులు నిర్ణయించుకుని, పవన్‌కల్యాణ్‌కు గట్టి షాక్ ఇచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు జనసేన ఇన్‌చార్జ్ విడవాడ రామచంద్రరావుకు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పంపుతానని వారాహి యాత్రలో పవన్‌కల్యాణ్ బహిరంగంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వనందుకు పవన్‌కల్యాణ్ బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు. ఇప్పుడు పొత్తులో భాగంగా తణుకులో టీడీపీ పోటీ చేస్తోంది. ఈ మేరకు టీడీపీ అభ్యర్థిగా అరిమిల్లి రాధాకృష్ణను ప్రకటించడం విశేషం.
అలాగే ఏలూరులో కూడా జనసేన బలంగా ఉన్నట్టు ఇన్‌చార్జ్ రెడ్డి అప్పలనాయుడు చెబుతున్నారు. జనసేన గెలిచే నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు ప్రకటించిన 94 మంది జాబితాలో ఏలూరు కూడా వుంది. ఇక్కడి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణ పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించి, జనసేనకు షాక్ ఇచ్చారు.
ఈ అవమానాల్ని జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పవన్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు జనసేన నాయకులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం ఉమ్మడి సభకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని ఆ రెండు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, వారి అనుచరులు తీర్మానించారు. ఈ పరిణామాలు జనసేన వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.